కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్
09:06 July 04
petition breaking
కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్ దాఖలు చేశారు. హౌస్‌మోషన్ పిటిషన్ వేసిన ఆ రైతు... ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందంటూ వ్యాజ్యంలో పేర్కొన్నారు. జూన్ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీరు వదలటం వల్ల ఏపీకి నష్టం కలుగుతోందని పిటిషన్లో ప్రస్తావించారు.
మరోవైపు... ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ప్రాజెక్టుల ద్వారా నీటి ఎత్తిపోతలు, జలవిద్యుదుత్పత్తి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. కృష్ణా జలాల్లో 66:34 నిష్పత్తిలో కేటాయింపులను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు ఈ ఏడాది నుంచి చెరిసగం వినియోగించుకోవాలని చెప్పింది.
పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టులేనని.. నికరంగా కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే కృష్ణా నీటిని వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టం చేసింది. రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడతామని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. నీటిలభ్యత ఉన్నంతవరకూ అన్నిచోట్లా పూర్తి స్థాయిలో జలవిద్యుదుత్పత్తి చేపట్టాల్సిందేనని అభ్యంతరం చెప్పే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఏర్పాటై 17 ఏళ్లైనా తెలంగాణకు కృష్ణాజలాల్లో వాటా నిర్ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నీటివాటా కోసం కేంద్రంతో పోరాడతామన్నారు.