నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఇకలేరు. డాక్టర్‌గా సుపరిచితులైన కోడెల ఇవాళ హైదరాబాద్‌లోని సొంత నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు సమీపంలోని బసపతారకం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి, కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు.
వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న కోడెల జన్మించారు. గుంటూరు జిల్లా సిరిపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన కోడెల.. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఎన్టీఆర్ పిలుపుతో 1983లో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గుంటూరు జిల్లాలో తిరుగులేని నేతగా నిలిచారు. 1983 నుంచి 1999 వరకు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా... 2014లో సత్తెనపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1987-88లో హోంమంత్రిగా, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖమంత్రిగా, 1997-99లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సేవలు అందించారు.