ఏపీ మంత్రి జయరామ్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి ధ్వజమోత్తారు. ఈఎస్‌ఐ కేసులో నిందితుడి నుంచి కారు తీసుకుని పుట్టినరోజు కానుకగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి కుమారుడు బెంజ్ కారును లంచంగా తీసుకున్నారని పేర్కొన్నారు. వాస్తవాలు ఒప్పుకుని నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
ఇప్పటికీ సీఎం జగన్ కాపాడతారా ?
ఇప్పటికీ మంత్రి జయరామ్‌ను సీఎం జగన్ కాపాడుకుంటూ వస్తారా..? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అవినీతి నిరోధకశాఖకు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారని.. కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈశ్వర్ బెంజ్ కారు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమంలో పెట్టుకున్నారని గుర్తు చేసిన అయ్యన్న.. సదరు కారు వారి ఇంట్లోనే ఉందని స్పష్టం చేశారు. తమకు సంబంధం లేదని చెబుతూనే అదే కారులో తిరుగుతున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ కేసులో ఏ-14 నిందితుడు మంత్రి జయరామ్‌కు బినామీ అని అయ్యన్న పునరుద్ఘాటించారు. ఈ విషయంపై సీఎం జగన్ వెంటనే స్పందించాలన్నారు.