AP CM YS Jagan: ప్రభుత్వం.. ఉద్యోగులదనే విషయం గుర్తించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో మాట్లాడిన సీఎం.. ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగల్గుతామని చెప్పారు. కొవిడ్, ఆర్థిక పరిస్థితుల్లోనూ చేయగల్గినంత చేశామని పేర్కొన్నారు. సమస్యలుంటే ప్రభుత్వాన్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చన్నారు. మంత్రుల కమిటీ నిర్ణయాలు సంతోషాన్ని ఇచ్చాయని భావిస్తున్నానని తెలిపారు.
"ఐఆర్ సర్దుబాటు వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్లు, హెచ్‌ఆర్‌ఏ వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.325 కోట్ల భారం పడనుంది. మార్పు చేసిన హెచ్‌ఆర్‌ఏ వల్ల ప్రభుత్వంపై రూ.800 కోట్లు, అదనపు క్వాంటం ఆఫ్ పింఛన్ వల్ల రూ.450 కోట్లు, సీసీఏ వల్ల మరో రూ.80 కోట్లు, కొత్త పీఆర్సీ వల్ల ఏటా ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల భారం పడుతుంది. ఉద్యోగుల ఇతర ప్రయోజనాలకు అదనంగా రూ.1,330 కోట్ల వ్యయం అవుతాయి"
-ఏపీముఖ్యమంత్రి జగన్
ap employees steering committee: సీఎంతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితుల వల్ల అనుకున్నంత ఇవ్వలేకపోతున్నట్లు సీఎం చెప్పారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, అదనపు క్వాంటం ఆఫ్ పింఛన్లపై స్పష్టత ఇచ్చారని వివరించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు విషయంపై కూడా వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీతో ప్రతి నెలా భేటీ నిర్వహిస్తామని అన్నారు.
ఉద్యమం వరకు వెళ్లొద్దని చెప్పారు : బొప్పరాజు
"సమస్యలుంటే ఉద్యమం వరకు వెళ్లవద్దని సీఎం చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీని కొనసాగిస్తామని చెప్పారు. సమస్యలపై భవిష్యత్లో మంత్రుల కమిటీతో చర్చించాలని చెప్పారు. ప్రతినెలా ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతామన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగైతే భవిష్యత్లో మరింత లబ్ధి చేస్తామన్నారు"