ఏపీ ఎంసెట్ ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇవాళ విడుదల చేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి ఆనందాన్ని ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
న్యూరాలజిస్ట్ అవడమే లక్ష్యం
న్యూరాలజీ వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకుని ఉందని, ఆ విభాగంలో వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవలు చేస్తానని ఎంసెట్ వ్యవసాయ, ఫార్మసీలో రెండో ర్యాంక్ సాధించిన త్రిపురనేని లక్ష్మీసాయిమారుతీ అన్నారు. రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎయిమ్స్‌లో న్యూరాలజీ వైద్యురాలు కావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే రెండో ర్యాంకు వచ్చిందన్నారు. సాయిమారుతీకి మంచి ర్యాంకు రావడం పట్ల తల్లదండ్రులతో పాటు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
వైద్యుడిగా రాణిస్తాను
రెండున్నరేళ్ల కష్టానికి ఫలితమే రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకని ఎంసెట్ ర్యాంకర్ మనోజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మెడిసిన్ విభాగంలో రాష్ట్ర మూడో ర్యాంకు సాధించిన మనోజ్ కుమార్‌ని తిరుపతిలో ఆయన చదువుకున్న కళాశాల యాజమాన్యం సత్కరించింది. కుమారుడి విజయం పట్ల తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపించారు. రెండున్నరేళ్లు ప్రణాళికబద్ధంగా చదవటమే తన విజయానికి కారణమని మనోజ్ కుమార్ అన్నారు. మెడిసిన్ పూర్తి చేసి మంచి వైద్యుడిగా రాణించాలన్నదే తన లక్ష్యంగా తెలిపారు.
పేదలకు సేవ చేస్తాను
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. ఉపాధ్యాయుల సహకారంతో ఎంసెట్‌లో ఏడో ర్యాంకు సాధించానని లికిత అన్నారు. కడప ప్రకాష్ నగర్‌కు చెందిన వేణుగోపాల్ రెడ్డి, సుజాత ఇద్దరు ఉపాధ్యాయులు. వారి కుమార్తె ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించారు. వైద్యురాలిగా ప్రజల సేవలందిస్తానని లిఖిత తెలిపారు.
పేదలకు వైద్య సేవలు అందిస్తాను
ఎంసెట్ ఫలితాల్లో కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడుకు చెందిన జడ వెంకట వినయ్ కుమార్ ఎంసెట్ వైద్యవిభాగంలో 8వ ర్యాంకు సాధించారు. ఎంసెట్‌లో స్టేట్ 8వ ర్యాంకు సాధించడం పట్ల వినయ్ తల్లిదండ్రులు జడ శ్రీనివాసులు, నాగసూర్య హర్షం వ్యక్తం చేశారు. నీట్లో కూడా ర్యాంకు సాధిస్తానని వినయ్ ఆశాభావం వ్యక్త చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించానని వినయ్ అంటున్నారు. మెడిసిన్ పూర్తి చేసి వైద్యుడు అయ్యి ప్రజలకు సేవ చేస్తానని వినయ్ తెలిపారు.