ఏపీ వైద్యారోగ్య శాఖ, నాడు-నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులపై పురోగతిపై ఆ రాష్ట్ర సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఒక వైద్యుడు ప్రతి నెలా రెండుసార్లు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో అవగాహన ఉండాలన్నారు. గ్రామానికి వెళ్లే వైద్యుడి వెంట ఆరోగ్యమిత్ర, ఆశా కార్యకర్త ఉంటారని తెలిపారు. వైద్యుడు తన సేవలు అందించేందుకు విలేజ్ క్లినిక్ కూడా వేదికగా ఉంటుందని పేర్కొన్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య కార్డుల్లో నమోదుకు అవకాశం ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై సీఎం సమీక్షించారు. ఏపీలో ఉన్న సదుపాయాలను అధికారులు వివరించారు. వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.