ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్‌రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు. అభ్యర్థుల ఎంపికపై వైకాపా అధినేత, సీఎం జగన్ పలుమార్లు ముఖ్యనేతలతో చర్చించారు. అనంతరం అభ్యర్థులను ఖరారు చేశారు.
ఏపీ సీఎం జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల కోసమే తాను పోరాడుతున్నాట్లు తెలిపారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు మాత్రమే పరిమితమైనది కాదని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు తాను చేస్తున్న సేవను గుర్తించి ఏపీ సీఎం జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అన్ని అంశాలను పరిశీలించి ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బలహీనవర్గాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారని.. సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పారు. పరిపాలన, నామినేటెడ్ స్థానాల్లో బలహీనవర్గాలకు అవకాశం కల్పించి వారిని పైకి తీసుకురావాలన్నదే జగన్ ఆలోచన అని బొత్స అన్నారు.