ఆంధ్రప్రదేశ్ తెదేపా సామాజిక మాధ్యమ బాధ్యుడు చింతకాయల విజయ్‌కు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 10.30 నిమిషాలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 12గంటల సమయంలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఉన్న విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లారు.
అపార్ట్మెంట్ కాపలాదారుడిని ఇంటి చిరునామా అడిగారు. అక్కడే ఉన్న విజయ్ డ్రైవర్‌ను కాపలాదారు పిలిచాడు. డ్రైవర్‌ను వెంట పెట్టుకొని సీఐడీ పోలీసులు విజయ్ ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేరని పనిమనిషి చెప్పారు. సీఐడీ పోలీసులు ఇంటి లోపల ఉన్న గదులను మొత్తం వీడియో తీశారని పని మనిషి తెలిపారు. విజయ్ పెద్ద కూతురిని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారని పని మనిషి చెప్పారు. ఇంట్లోకి తీసుకెళ్లాలని తనపై చేయి చేసుకున్నారని విజయ్ కారు డ్రైవర్ తెలిపారు.
ఓ కేసులో 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు మాత్రమే ఇంటికి వచ్చామని సీఐడీ అధికారి పెద్దిరాజు తెలిపారు. నోటీసులు ఇచ్చి వెళ్తున్న సమయంలో కొంతమంది తెదేపా నాయకులు విజయ్ ఇంటికి చేరుకున్నారన్నారు. ఇంట్లో దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వచ్చింది పోలీసులా కాదా అని అనుమానం ఉందని బంజారాహిల్స్ పీఎస్‌లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.
ఏపీ సీఐడీ రూల్స్‌ను అతిక్రమించి ప్రవర్తిస్తోంది:సీఐడీ రూల్స్‌ను అతిక్రమించి ప్రవర్తిస్తోందని ఏపీ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి ఇంట్లో చిన్న పిల్లలు లేరా అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు ఎలా వస్తారని నిలదీశారు. ఏపీ సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారని స్పష్టం చేశారు.