తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CID Raids: మాజీ ఐఏఎస్‌ ఇంట్లో హైడ్రామా నడుమ సీఐడీ సోదాలు - తెలంగాణ వార్తలు

AP CID Raids : మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. విచారణ సందర్బంగా ఆయన ఉద్వేగానికి గురయ్యారు. కళ్లు తిరిగిపడిపోయిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

AP CID Raids, Former IAS Lakshmi narayana
మాజీ ఐఏఎస్‌ ఇంట్లో హైడ్రామా నడుమ సీఐడీ సోదాలు

By

Published : Dec 11, 2021, 8:39 AM IST

AP CID Raids: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ హైడ్రామా నడుమ సోదాలు నిర్వహించింది. పోలీసులు ప్రవర్తించిన తీరును ఆయన కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. విచారణ సందర్భంగా ఉద్వేగానికి గురైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. నాటకీయ పరిణామాల మధ్య దాదాపు పది గంటల పాటు సీఐడీ అధికారులు సోదాలు చేశారు. 13వ తేదీ విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు.

కళ్లు తిరిగి పడిపోయిన లక్ష్మీనారాయణ

Former IAS Lakshmi narayana: హైదరాబాద్​లోని మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన లక్ష్మీనారాయణ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సేవలందించారు. అయితే.. లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే అధికారులు సోదాలు చేపట్టినట్టు సమాచారం. కాగా.. ఈ తనిఖీల క్రమంలో లక్ష్మీనారాయణ అధిక రక్తపోటు కారణంగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారు. పరీక్షించిన ఫ్యామిలీ డాక్టర్.. ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆయన సూచన మేరకు కుటుంబసభ్యులు లక్ష్మీనారాయణను ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 13న విచారణకు హాజరుకావాలని లక్ష్మీనారాయణకు నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు.

నిధులు దుర్వినియోగం చేశారని..

ఆంధ్రప్రదేశ్‌ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి 241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. సీఐడీ అధికారులు.. లక్ష్మీనారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్​లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సోదాలు చేశారు. గురువారమే హైదరాబాద్‌కు చేరుకున్న సీఐడీ అధికారులు.. సోదాల కోసం జూబ్లీహిల్స్ స్టేషన్‌లో పోలీసు సిబ్బంది సాయాన్ని కోరారు. ఇతర వివరాలు కావాలని పోలీసులు అడగ్గా.. సోదాలు ఎక్కడ చేయాలన్న సమాచారం సీల్డ్‌ కవర్‌లో అందాకే అందించగలమని చెప్పి సీఐడీ సిబ్బంది వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్‌ పోలీసుల సాయం తీసుకోకుండానే.. డీఎస్పీ ధనుంజయుడు, సీఐ జీవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని దాదాపు పదిమంది.. జూబ్లీహిల్స్‌ నవనిర్మాణ నగర్‌లో ఫ్లాట్ నెంబర్‌ 108లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకుంది.

కాసేపు ఉద్రిక్తత

lakshminarayana sick: సీఐడీ అధికారులు లోపలికి రాకుండా లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబీకులు అడ్డుకున్నారు. నోటీసులు, వారెంట్ లేకుండా అనుమతించబోమన్నారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. సంబంధింత పత్రాలు చూపాక.. లక్ష్మీనారాయణ వారిని అనుమతించారు. ఈ క్రమంలోనే సీఐడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని లక్ష్మీనారాయణ ఇంట్లోని పనిమనుషులు ఆరోపించారు. సోదాల్లో భాగంగా హార్డ్‌ డిస్కు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు సోదాలు చేస్తుండగా మరికొందరు లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఉద్వేగానికి గురై ఒక్కసారిగా కింద పడిపోయారు. కుటుంబ వైద్యుడికి ఫోన్ చేయగా.. ఆయన వచ్చి పరిశీలించి రక్తపోటు పెరిగినట్టు గుర్తించారు. కొన్ని వైద్యపరీక్షలు, ప్రాథమిక చికిత్స చేశారు. ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించినా సీఐడీ అధికారులు అందుకు అంగీకరించలేదు. ఇంట్లోనే వైద్యం అందించాలన్నారు. గతంలో 2 శస్త్రచికిత్సలు జరగడం, రక్తపోటు పెరగటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్య బృందం స్పష్టం చేసింది. కుటుంబసభ్యులూ సీఐడీ అధికారులను నిలదీశారు. చివరకు వారు అంగీకరించడంతో ఆయనను బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

'వేరే కారణం ఉందేమో!'

నైపుణ్యాభివృద్ధి సంస్థలో తాను సంచాలకుడిగానే పనిచేశానని, గౌరవ వేతనమూ తీసుకోలేదని లక్ష్మీనారాయణ చెప్పారు. తన ఇంటి వద్ద విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఈ సంస్థలో ఛైర్మన్‌తో పాటు ఐదుగురు కార్యదర్శులు ఉన్నారని, వీరిలో కొందరు ఇప్పటికీ పని చేస్తున్నారన్నారు. వారందరినీ వదిలేసి తనకు నోటీసులు ఇవ్వడం ఏంటని పోలీసులను ప్రశ్నించానన్నారు. డైరెక్టర్‌గా పనిచేశాను కాబట్టే నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్పారని.. అలాంటప్పుడు 8 మంది డైరెక్టర్లలో ఎవరికైనా ఇచ్చారా అని అడిగినట్టు చెప్పారు. దీని వెనుక కులమో.. మరేదైనా కారణమో ఉండి ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. సీఐడీ బృందంలోని కొందరు సభ్యులు తాము స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్కులు, ఇతర పత్రాలు తీసుకొని రెండు వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోగా.. మరికొందరు కాసేపు లక్ష్మీనారాయణ ఇంట్లోనే ఉండి, సాయంత్రం 6 గంటల సమయంలో వెళ్లారు. ఈ నెల 13న ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణకు తమ ఎదుట హాజరుకావాలంటూ కుటుంబసభ్యులకు నోటీసు అందించారు.

సీఐడీ తీరుపై ఆగ్రహం..

సోదాలకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ ఇంటి బయట తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, తదితరులు ఆందోళన చేశారు. తమకు భద్రత కావాలంటూ సీఐడీ అధికారులు అప్పుడు జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించారు. ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పినా పట్టించుకోకుండా సోదాలకు వెళ్లడంపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బందిని పంపారు. వారు వచ్చి.. నినాదాలు చేస్తున్న తెలుగుదేశం నాయకులను శాంతింపజేసి, అక్కడి నుంచి పంపించారు. సీఐడీ తీరు విశ్రాంత ఐఏఎస్​ ప్రాణాల మీదకు తెచ్చిందని కేశవ్ ధ్వజమెత్తారు. పోలీసుల వైఖరి వల్లనే లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో సీఎం జగన్ సన్నిహితుడనే ప్రేమచంద్రారెడ్డిని వదిలేశారని మరో తెదేపా నేత పట్టాభి ఆగ్రహించారు. ప్రేమచంద్రారెడ్డి హయాంలోనే రూ.371 కోట్ల చెల్లింపులు జరిగాయని ఆరోపించారు.

ఇదీ చదవండి:పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా కోసం మళ్లీ యత్నం... కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం!

ABOUT THE AUTHOR

...view details