ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నమని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం పేర్కొన్న కేంద్రం తాజాగా నాలుక కరుచుకుంది. జులై 26న లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నాన్ని పెట్రోలియం శాఖ పేర్కొనడం వివాదాస్పదమైంది. దీనిపై ఆ శాఖ ఆదివారం రాత్రి వివరణ ఇచ్చింది. ఈ సమాధానం ద్వారా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పడం తమ ఉద్దేశం కాదని, పెట్రో పెరుగుదలకు సంబంధించి దాన్ని ఒక ప్రతిపాదిత నగరంగా మాత్రమే (రెఫరెన్స్ సిటీ) ఉదహరించినట్లు పేర్కొంది.
పెట్రో ధరల పెరుగుదల వల్ల దేశంపై ప్రభావం గురించి జులై 26న ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో విధిస్తున్న పన్నులను చెప్పారు. రాష్ట్రాల పేర్లు, దాని పక్కన రాజధాని/నగరం అని ఉండాల్సిన చోట కేవలం రాజధాని అని మాత్రమే పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది. విశాఖనే కాకుండా హరియాణాకు అంబాలా, పంజాబ్‌కు జలంధర్ అని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ తప్పును సరిదిద్దుకుంటున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘సమాధానంలోని మూడో కాలమ్‌లో రాజధాని అన్న హెడ్డింగ్ కింద ఇచ్చిన నగరాలను కేవలం ఆ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి చెప్పడానికి మాత్రమే నిర్దేశించాం. అందువల్ల ఆ హెడ్డింగ్‌ను కేవలం రాజధాని అని మాత్రమే చదువుకోకుండా రాజధాని/ప్రతిపాదిత నగరం (కేపిటల్/రిఫెరెన్స్ సిటీ)గా చదువుకోవాలని కోరుతున్నాం. ఆ సమాధానంలో ఈ మేరకు మార్పు చేసి లోక్‌సభ సచివాలయానికి కూడా చెప్పాం’ అని పెట్రోలియం శాఖ పేర్కొంది.