తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​లో.. మూడు రాజధానులు సాధ్యమేనా? - మూడు రాజధానులు సాధ్యమేనా?

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైకాపా ప్రభుత్వం ముందుకుతెచ్చిన మూడు రాజధానుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ శాసన రాజధాని అమరావతిలో, పాలనా రాజధాని విశాఖపట్నంలో, న్యాయ రాజధాని కర్నూలులో ఉంటాయని సూచించడం ఈ రగడకు కారణమైంది. మూడు రాజధానులు సాధ్యమేనా...? ఏపీ నిర్ణయం..అమలు క్లిష్టతరం కానుందా...?

ap-capital-issue
ఆంధ్రప్రదేశ్​లో.. మూడు రాజధానులు సాధ్యమేనా?

By

Published : Jan 17, 2020, 9:32 AM IST


అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైకాపా ప్రభుత్వం ముందుకుతెచ్చిన మూడు రాజధానుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర శాసన సభలో మాట్లాడుతూ శాసన రాజధాని అమరావతిలో, పాలనా రాజధాని విశాఖపట్నంలో, న్యాయ రాజధాని కర్నూలులో ఉంటాయని సూచించడం ఈ రగడకు కారణమైంది. ప్రభుత్వం తన అభీష్టం నెరవేర్చుకోవడానికి జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదికలను ఉపయోగించుకొంటోందనే భావన వేళ్లూనుకుపోయింది.

ఇక్కడ గమనించాల్సిన వింత ఏమంటే బీసీజీకి సాధికారత లేకపోయినా, అది కూడా నేరుగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం. ఈ రెండు కమిటీల నివేదికలను పరిశీలించి భవిష్య కార్యాచరణను ప్రతిపాదించడానికి పదిమంది కేబినెట్​ మంత్రులు, కొందరు అధికారులతో ఒక హైపవర్‌ కమిటీని నియమించారు. 2014 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టం కింద అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులు వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వారి ఆందోళన క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ పాకుతోంది. ఇంతకీ మూడు రాజధానుల ఏర్పాటుకు చట్టం ఒప్పుతుందా లేదా అన్నది విశ్లేషించడం చాలా ముఖ్యం.

‘ఒక పనిని ఫలానా విధంగా చేయాలని చట్టం నిర్దేశించినట్లయితే, ఆ పని అదే ప్రకారం జరగాలి’అని 1936నాటి ఒక కోర్టు తీర్పు స్పష్టం చేసింది. 2014 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం (2014లో అమలులోకి వచ్చిన ఆరవ చట్టం) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. రెండు రాష్ట్రాలకూ హైదరాబాద్‌ నగరమే పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ఆ చట్టం నిర్దేశించింది. ఆ గడువు ముగిశాక ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానిని అమర్చుకొంటుందని పై చట్టంలోని 2వ సబ్‌ సెక్షన్‌ పేర్కొన్నది.

కొత్త రాజధాని ఎక్కడ ఏర్పడాలో సూచించడానికి నిపుణుల సంఘాన్ని నియమించాలని ఆరో సెక్షన్‌ సూచించింది. 214 అధికరణ కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పడేవరకు హైదరాబాద్‌లోని హైకోర్టే ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని 30(1) సెక్షన్‌ ఉద్ఘాటించింది. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పడాలని 31(1) సెక్షన్‌ ఉల్లేఖించింది. భారత రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నోటిఫై చేసిన ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నెలకొంటుందని 31(2) సెక్షన్‌ పేర్కొన్నది. పునర్విభజన చట్టంలోని 94(1) సెక్షన్‌ రెండు రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రాయితీల గురించి వివరించింది.

హైకోర్టు ధర్మాసనాలు...
పునర్విభజన చట్టం 94వ సెక్షన్‌లోని మూడో సబ్‌ సెక్షన్‌ ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి రాజ్‌భవన్‌, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, విధాన సభ, విధాన మండలి తదితర మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని నిర్దేశించింది. 1956 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 51(1) సెక్షన్‌ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్రపతి నోటిఫై చేసిన ప్రదేశంలో హైకోర్టు ఏర్పరచాలని పేర్కొంది. 2014 చట్టంలోని 32(2) సెక్షన్‌ కూడా ఇదే మాట అన్నది. 1956 చట్టంలోని 51(2) సెక్షన్‌ రాష్ట్రపతి నోటిఫై చేసిన ప్రదేశంలో హైకోర్టు ముఖ్య కార్యాలయాన్ని నెలకొల్పి, ఇతర చోట్ల హైకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని కానీ, ధర్మాసనాలను కానీ నెలకొల్పవచ్చని ఉద్ఘాటించింది. ఈ మేరకు కొత్త రాష్ట్ర గవర్నర్‌తోనూ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ సంప్రదించి రాష్ట్రపతి ఉత్తర్వు జారీచేయవచ్చన్నది. 1956 చట్టంలో ఇచ్చిన ఈ వెసులుబాటును 2014 చట్టంలో పొందుపరచలేదు కాబట్టి హైకోర్టు ముఖ్య కార్యాలయానికి తోడుగా ఇతర చోట్ల శాశ్వత బెంచీ లేదా బెంచీలను ఏర్పాటుచేయడం సాధ్యంకాదు. 2014 చట్టం ప్రకారం రాష్ట్ర విధాన సభకు అలాంటి అధికారం లేదు.

1956నాటి చట్టం ప్రకారం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌ కన్నా 2014నాటి చట్టం కింద ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్‌ పరిమాణంలో చిన్నది కాబట్టి హైకోర్టుకు అదనపు ధర్మాసనాలు అవసరం లేదని శాసనకర్తలు భావించి ఉండవచ్చు. కారణమేదైనా, చట్టం చెప్పినదానికి భిన్నంగా నడచుకుంటే ఆ చట్ట నిబంధనలను ఉల్లంఘించడమవుతుంది. ఏతావతా 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 31(2) సెక్షన్‌ నిర్దేశించిన ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వు మేరకు అమరావతిలో ఏర్పడిన హైకోర్టు ముఖ్య కార్యాలయం కాకుండా వేరే ఏ ప్రదేశంలోనూ శాశ్వత ధర్మాసనం లేక ధర్మాసనాలను నెలకొల్పడం సాధ్యపడదు. అయినా సరే అమరావతికి తోడు ఇతర చోట్ల శాశ్వత ధర్మాసనం లేదా ధర్మాసనాలను ఏర్పరచాలీ అంటే, 2014నాటి చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.

లోతైన అధ్యయనం తరవాతే....
పై చట్టంలోని 5(2) సెక్షన్‌ కొత్త రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుకు సంబంధించినది. రాజధానిని ఎక్కడ నెలకొల్పాలో సిఫార్సులు చేయడానికి నిపుణుల సంఘాన్ని నియమించాలని ఆరవ సెక్షన్‌ సూచించింది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శివరామ కృష్ణన్‌ కమిటీని నియమించగా, రాజధాని అంశంపై అధ్యయనం చేశాక ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రాజధాని ఎంపికకు శివరామ కృష్ణన్‌ జరిపిన అధ్యయనం, చేసిన సిఫార్సు ఏదైనా కానీ, అంతిమంగా రాజధాని ఎక్కడ స్థాపించాలనే అంశంపై నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది.

ఆపైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుంది. రాష్ట్ర విధాన సభ ఆమోదించిన 2014 ఆంధ్రప్రదేశ్‌ సీఆర్డీఏ చట్టం కొత్త రాజధాని ప్రాంతాన్ని ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రచించడం, ఆ ప్రణాళిక అమలు, సమన్వయం, పర్యవేక్షణ, నిధుల సమీకరణ బాధ్యతలను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)కు అప్పగించింది. ఏపీ సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించే అధికారాన్ని పై చట్టంలోని 3(1) సెక్షన్‌ ప్రభుత్వానికే దత్తం చేసింది. రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేసే అధికారాన్ని సబ్‌ సెక్షన్‌ 2 దఖలు పరచింది. రాజధాని ప్రాంతంలో రాజధాని నగరమేదో ప్రకటించే అధికారాన్ని 3(3) సెక్షన్‌ కట్టబెట్టింది. 2014లో కేంద్రం చేసిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 5(2) సెక్షన్‌ ప్రకారం రాజధాని ప్రాంతాన్ని (సీఆర్డీఏ), రాజధాని నగరాన్ని గుర్తిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన రాజధాని ప్రాంతానికి అమరావతిగా నామకరణం చేశారు.

గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలతోపాటు తాడేపల్లి పురపాలక సంఘ పరిధిలోని కొన్ని ప్రాంతాలు అమరావతి పరిధిలోకి వస్తాయి. ఈ విధంగా కేంద్ర చట్టంలో 5(2), 6, 31(2) సెక్షన్ల కింద పూర్తి చేయవలసిన లాంఛనాలన్నింటినీ పూర్తి చేశారు. అదే చట్టంలోని 94(3) సెక్షన్‌ కింద కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్నీ స్వీకరించారు. కేంద్ర చట్టం రాజధాని గురించే ప్రస్తావించిది తప్ప, రాజధానుల గురించి కాదు.

న్యాయస్థానాలు చెప్పిందేమిటి?
ఇక్కడ 1992నాటి భవానీ శంకర్‌ త్రిపాఠీ వర్సెస్‌ ప్రభుత్వ కార్యదర్శి కేసులో ఒడిశా హైకోర్టు డివిజన్‌ బెంచి తీర్పును గుర్తుచేసుకోవాలి. హైకోర్టు నిర్వహణ తీరును నిర్దేశిస్తూ చట్టం చేసే అధికారం రాష్ట్ర విధాన సభకు ఉన్నప్పటికీ, హైకోర్టు ఎక్కడ ఏర్పాటవ్వాలో నిర్దేశిస్తూ చట్టం చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు మాత్రమే ఉందని ఆ తీర్పు స్పష్టం చేసింది.

అలాగే 2015లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన మరో తీర్పును ఇక్కడ ఉదహరించాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రత్యేకంగా హైకోర్టును నెలకొల్పవచ్చా, తెలంగాణ కోసం హైదరాబాద్‌లో మరోచోటుకు హైకోర్టును మార్చవచ్చా అనే అంశంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు పరిశీలించింది. చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని హైకోర్టును లేదా కేంద్రాన్ని కోరే హక్కు తెలంగాణ విధాన సభకు కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ లేదని కోర్టు తీర్పుఇచ్చింది. చట్టం ఒక పనిని ఫలానా విధంగా చేయాలని నిర్దేశించినప్పుడు ఆ పని అదే విధంగా జరగాలన్నది. తెలంగాణ హైకోర్టును హైదరాబాద్‌లో ఇప్పుడున్న చోటు నుంచి మరే చోటుకూ మార్చడం కుదరదని స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక తెలంగాణ హైకోర్టును ఇప్పుడున్న చోటి నుంచి మార్చాలనుకుంటే చట్టపరంగా తగు చర్యలు తీసుకోవడం ద్వారా ఆ పని చేయవచ్చునని వివరించింది. ఇలా కాకుండా మరే విధంగానూ హైకోర్టును తరలించకూడదని స్పష్టం చేసింది.

ఇక్కడ 1982నాటి మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్‌ నారాయణ్‌ శ్యాం రావ్‌ పురాణిక్‌ తదితరుల కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఇక్కడ పరిశీలించాలి- ఒక చట్టం చేసిన తరవాత అది శాసన గ్రంథాల్లో శాశ్వతంగా నిలచిపోతుంది. 1897జనరల్‌ క్లాజుల చట్టంలోని 14వ సెక్షన్‌ ప్రకారం ఒక కేంద్ర చట్టం లేదా కేంద్ర నిబంధన కింద ఏదైనా అధికారం సంక్రమిస్తే దాన్ని అవసరమైనప్పుడల్లా ఉపయోగించాలి- దాన్ని ఫలానా సందర్భంలో ఉపయోగించకూడదనే నియంత్రణ ఉంటే తప్ప.ఆ చట్టం దీర్ఘకాలంగా ఉపయోగంలో లేదు కాబట్టి అది చెల్లదని చెప్పడం కుదరదు. ఆ చట్టాన్ని రద్దు చేయాలంటే, అందుకు ఒక పద్ధతి ఉంటుంది. ఏ పార్లమెంటు చట్టమైనా దీర్ఘకాలం నిరుపయోగంగా ఉందనే కారణంపై రద్దు కాబోదు.

ఈ తీర్పుల సారం బట్టి తేలేదేమంటే- 2014లో రాష్ట్ర విభజనకు కేంద్రం చేసిన చట్టాన్ని సవరించకుండా మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అసాధ్యం. తెలంగాణ విధాన సభ కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ కేంద్ర చట్ట నిబంధనలకు భిన్నంగా వ్యవహరించవలసిందిగా హైకోర్టునూ, కేంద్రాన్నీ ఆదేశించలేవని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ విధాన సభ కానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కానీ 2014 చట్ట నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవాలని హైకోర్టును కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరలేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను ఏర్పరచాలంటే 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసినా, సవరించినా న్యాయవివాదాల తేనె తుట్టెను కదిలించినట్లవుతుంది.
-అంబటి సుధాకరరావు (న్యాయవాది)

ABOUT THE AUTHOR

...view details