తెలంగాణ

telangana

ETV Bharat / city

'మంచి రోజు చూసుకుని 'దుల్హన్‌' పునఃప్రారంభిద్దాం' - Dulhan scheme latest news

reintroduce Dulhan scheme: పేద ముస్లిం యువతుల వివాహానికి సాయమందించే దుల్హన్ పథకాన్ని.. ఒక మంచి రోజు చూసుకుని తిరిగి ప్రారంభింద్దామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. మంత్రులతో అన్నారు. విదేశీ విద్య, విద్యా దీవెన వంటి పథకాలనూ సంతృప్త స్థాయిలో అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేద్దామన్నారు. శుక్రవారం నాటి కేబినెట్‌ సమావేశంలో.. ఎజెండా అంశాలపై చర్చ ముగిసి, అధికారులు వెళ్లిపోయాక.. మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని కొనసాగించారు.

దుల్హన్ పథకం
దుల్హన్ పథకం

By

Published : Jun 25, 2022, 9:46 AM IST

reintroduce Dulhan scheme: 'పేద ముస్లిం యువతుల వివాహానికి సాయమందించే దుల్హన్‌ పథకాన్ని ఒక మంచి రోజు చూసుకుని పునఃప్రారంభిద్దాం. విదేశీ విద్య, విద్యాదీవెన లాంటి పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేద్దాం' అని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు తెలిపారు. ఎజెండా అంశాలపై చర్చ ముగిసి, అధికారులు వెళ్లిపోయాక మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని కొనసాగించారు. అప్పుడు, అంతకుముందు అధికారులున్న సమయంలోనూ జరిగిన చర్చల్లోని వివరాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి.

'దుల్హన్‌'ను వారే ఆపేశారు...దుల్హన్‌ పథకం చర్చకు వచ్చినప్పుడు సీఎం స్పందిస్తూ... 'ఈ పథకాన్ని 2017, 18లలో వాళ్లే (అప్పటి తెదేపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి) ఆపేశారు. అప్పట్లోనే వేల మందికి పెండింగ్‌ పెట్టారు. అవి క్లియర్‌ చేసి, కొత్తగా మనం కొనసాగించాలంటే నిధులుండాలి కదా? మనమే ఆపేసినట్లు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు (తెదేపా) పెండింగులో పెట్టినవాటికి ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది? పథకాన్ని కొనసాగించేందుకు ఎంత ఖర్చవుతుందనే అంచనా సిద్ధం అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని పథకాన్ని పునఃప్రారంభిద్దాం' అని చెప్పినట్లు తెలిసింది.

విద్యాదీవెనపైనా అదే తీరు...విద్యాదీవెనపై హైకోర్టులో జరుగుతున్న విచారణ అంశంపైనా చర్చించారు. 'ఆ పథకంలో సుమారు నాలుగైదు వందల మంది విద్యార్థులు వీసా తిరస్కరణకు గురై, విదేశాలకు వెళ్లకపోయినా... వెళ్లినట్లుగా వారికి విదేశీ విద్య పథకం కింద సాయం అందించినట్లుగా తెదేపా ప్రభుత్వంలో చూపించారు' అని ఒకరిద్దరు మంత్రులు ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి స్పందిస్తూ 'అవన్నీ చూడాలి కదా? ఏదో కొద్ది మందికి ఇలా పథకాలు ఇవ్వడమనేది మన ఉద్దేశం కాదు. విదేశీ విద్య అయినా, విద్యాదీవెనలాంటి పథకాలైనా శాచురేషన్‌ పద్ధతిలో అమల్జేద్దాం. ఆ పథకాలన్నింటికీ వాళ్లు (తెదేపా ప్రభుత్వం) ఎంత పెండింగ్‌ పెట్టారో లెక్కలు తీసి, ఇప్పుడు కొనసాగించేందుకు ఎంతవుతుందనేది అంచనా వేసి, నిధులు ఎలా సమీకరించగలమనేదీ చూసుకుని ఒక సమగ్ర ప్రణాళికతో వెళదాం' అని చెప్పినట్లు సమాచారం.

రైతులు కాని వారికీ ఇచ్చేశారు...తిత్లీ తుపాను బాధితులకు అదనపు పరిహారం ఇచ్చేందుకు జారీ చేసిన జీఓను మంత్రివర్గం ర్యాటిఫై చేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో... తెదేపా హయాంలో 14,135 మంది రైతులు కాని వారికి, ఇతరులకు తిత్లీ పరిహారం ఇచ్చేశారనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ పరిహారం రికవరీకి, మొత్తం వ్యవహారంపై విచారణకు ఆర్థికశాఖ సిఫార్సు చేసినట్లు అధికారులు మంత్రివర్గం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. దీనిపై కొంత చర్చ తర్వాత ప్రస్తుతానికి విచారణకు ఆదేశించాలని, బాధ్యులెవరో తేలాక దాన్నిబట్టి రికవరీ, ఇతర చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పుడు రూ.5కోట్లు... అవి అయ్యాక మళ్లీ రూ.5కోట్లు..ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.2కోట్లు ఇస్తామన్నారని, జీఓ మాత్రం రాలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇకట్రెండు రోజుల్లోనే జీఓ ఇచ్చేయాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ నిధులకు సంబంధించిన అంశంపై కొంత సుదీర్ఘంగానే చర్చ జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... ‘మీకు రూ.2కోట్లు ఇస్తారు. ఇప్పుడు 'గడప గడపకు మన ప్రభుత్వం' కింద మీరు తిరుగుతున్న గ్రామాల్లోనే ఈ డబ్బులతో పనులకు ప్రతిపాదనలు ఇవ్వాలి. అలాకాకుండా మీరు తిరగని గ్రామాల్లో పనులకు ఇవ్వాలంటే మాత్రం నిధులిచ్చేది లేదు. ఏ పనులు చేస్తే ఎక్కువ మందికి వెంటనే ఉపయోగకరమో అలాంటి వాటినే ముందు చేపట్టాలి. మీకిచ్చే రూ.2కోట్లు అయిపోతే... మీ జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.5కోట్లు ఉంటాయి. వాటి నుంచి వినియోగించుకోవచ్చు. అవి కూడా అయిపోతే కలెక్టర్లకు మళ్లీ రూ.5 కోట్ల చొప్పున ఇస్తాం. ఇంకా ఏవైనా పెద్ద పనులుంటే ముఖ్యమంత్రి ఆఫీస్‌కు వాట్సప్‌ గ్రూప్‌లో ప్రతిపాదన పంపండి. వాటిని ఇక్కడి నుంచి చేయించేలా చూస్తాం’ అని వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

అన్ని వర్గాలకూ శ్మశానవాటికలు ఇవ్వాలి..ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అన్ని వర్గాల వారికీ శ్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వాలని పలువురు మంత్రులు సీఎంను కోరినట్లు తెలిసింది. ప్రభుత్వ భూములు, ఉపయోగంలో లేని అసైన్డ్‌ భూములను కేటాయిస్తే బాగుంటున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్పష్టమైన నిర్ణయం తీసుకోనప్పటికీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

రూ.30 కోట్లు ఆదాయం తెచ్చే పోస్టులు భర్తీ చేయకపోవడమేంటి?..రవాణా శాఖలో 101 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించినా అడుగు ముందుకు పడకపోవడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆర్టీవోలు 10, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ)-2, ఏఎంవీఐ-27 వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. ఆదాయార్జన శాఖలో ఇలా క్షేత్రస్థాయిలో పోస్టులు ఖాళీగా ఉండడమేంటనే అంశంపై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. వీటిని భర్తీ చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 కోట్ల ఆదాయం వస్తుందన్న చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి వెంటనే ‘ఈ అంశాన్ని మంత్రివర్గంలో టేబుల్‌ ఎజెండాగా పెట్టాలని అధికారులను ఆదేశించడం, అధికారులు అప్పటికప్పుడు దస్త్రం సిద్ధం చేసి మంత్రివర్గం ఆమోదాన్ని పొందడం’ జరిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.

ABOUT THE AUTHOR

...view details