AP Excise Department Budget 2022 : కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని అధికారంలోకి వచ్చాక 3 దశల్లో నిషేధిస్తామని, కేవలం ఐదు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే మద్యం లభ్యమయ్యేలా చేస్తామని 2019 ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ ఇచ్చింది. తాజాగ బడ్జెట్‌లో అందుకు విరుద్ధంగా.. దశలవారీ మద్య నిషేధాన్ని పక్కన పెట్టేసింది.
Budget For AP Excise Department 2022 : రాబోయే ఆర్థిక సంవత్సరం 2022-23లో స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద 16 వేల 500 కోట్ల మేర ఆదాయం ఉంటుందని బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22లో స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద 14 వేల 500 కోట్లు రాబడి వస్తుందని.. సవరించిన అంచనాల్లో పేర్కొంది. దాంతో పోలిస్తే 2022-23లో ఎక్సైజ్ పద్దు ద్వారా అదనంగా 2 వేల 500 కోట్ల మేర రాబడి వస్తుందని అంచనా. ఆ మేరకు లక్ష్యానికి చేరుకోవాలంటే మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచాల్సిందేనని బడ్జెట్‌లో పరోక్షంగా ప్రభుత్వమే చెప్పింది. 2019-20లో 20 వేల 871 కోట్లు, 2020 -21లో 20వేల 189 కోట్లు విలువైన మద్యం అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 - 22లో ఇప్పటి వరకు 22 వేల కోట్లకు పైగానే విక్రయాలు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద 14 వేల 500 కోట్ల మేర రాబడి ఉంటుందని సవరించిన అంచనాల్లో పేర్కొంది.