ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల్ని తెలంగాణ ప్రభుత్వం హరిస్తున్నా... వైకాపా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని భాజపా ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని దొంగతనం చేయడమే కాకుండా... ఏపీని బెదిరిస్తోందన్నారు. జగన్ కనీసం బయటకు వచ్చి మాట్లాడలేని దయనీయ పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ చర్యలతో నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని... ప్రాజెక్టు వద్దకు ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే వెళ్లలేని పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. కేవలం కేంద్రానికి లేఖలు రాసి జగన్ తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాజెక్టులను ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు. కేవలం ఆస్తులను రక్షించుకోవడం కోసమే తెలంగాణ ముఖ్యమంత్రికి భయపడుతున్నారని ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర పరిధిలోకి రాదన్నారు. జల వనరుల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై భాజపా ఉద్యమం చేస్తుందని తెలిపారు.