Anticipatory Bail For Ex Minister Narayana: ఏపీలో అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు.. హైకోర్టు 3 నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అతడి తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టులో వాదనలు వినిపించారు. మిగతా నిందితులకు కింది కోర్టు రిమాండ్ తిరస్కరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో నారాయణ కీలక నిందితుడని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదని వాదించగా.. మరో కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ వచ్చిందని నారాయణ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే:రాజధాని అమరావతి పరిధిలో అసైన్డ్ భూములను మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన బంధువులు, అనుచరులతో అక్రమంగా కొనిపించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో సీఐడీ అధికారులు మంగళవారం ఐదుగురిని అరెస్టు చేశారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు కొల్లి శివరామ్, గట్టెం వెంకటేశ్‌తో పాటు విశాఖపట్నానికి చెందిన చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబును అరెస్టు చేశారు. వీరిలో శివరామ్, వెంకటేశ్‌లను న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, వారిని జ్యుడీషియల్ రిమాండుకు ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలేనికి చెందిన యలమటి ప్రసాద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో నమోదైన కేసులో ఈ అరెస్టులు చేశారు.
మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు.. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కేవీపీ అంజనీకుమార్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. భూ సమీకరణ పథకంలో భాగంగా అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించదని, వాటిని అసైనీల నుంచి స్వాధీనం చేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మధ్యవర్తులు, స్థిరాస్తి వ్యాపార ఏజెంట్లతో బెదిరించి.. మాజీ మంత్రి నారాయణ, ఆయన అనుచరులు నిర్ణయించిన ధరకే రైతులు అమ్ముకునేలా చేశారని తమ దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. రాజధానిలో 1,100 ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. 169.27 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య రూ.15 కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచినట్లు తమ దర్యాప్తులో గుర్తించామని వివరించింది. ఈ సొమ్మును అమరావతిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అతి తక్కువ ధరకు అసైన్డ్ భూములు కొనేందుకు వినియోగించినట్లు తేల్చామని చెప్పింది.