ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్, ఏసీ భద్రాజీ రథం నిర్మాణంపై చర్చించారు. రథం నిర్మాణానికి, షెడ్డు మరమ్మతులతో పాటు ఇనుప షట్టర్ అమర్చడానికి రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవాదాయశాఖ ఈఈ శేఖర్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. దగ్ధమైన రథానికి రూ.84 లక్షల బీమా ఉన్నా.. ఆ సొమ్ము రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే వీలైనంత త్వరగా ప్రభుత్వ నిధులతో రథం నిర్మాణం చేపట్టనున్నారు. 2021 ఫిబ్రవరిలో స్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. అప్పటిలోగా రథం సిద్ధమవుతుందని ఆలయ సహాయ కమిషనర్ భద్రాజీ తెలిపారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నట్లు ఏసీ భద్రాజీ వివరించారు.
అంతర్వేది ఘటనపై నిరసనలు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అంతర్వేది ఘటనకు నిరసనగా శుక్రవారం భాజపా, జనసేనల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కందుల దుర్గేష్ తదితరులతో కలిసి ధర్నా నిర్వహించారు. కాకినాడలో కలెక్టరేట్ ఎదుట భాజపా, జనసేన శ్రేణుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు.