హైదరాబాద్ మీర్‌పేటలో బాలుడి అపహరణ కేసు రాచకొండ పోలీసులు సాంకేతికతను ఉపయోగించి తమదైన శైలిలో ఛేదించారు. కేవలం గంటల వ్యవధిలోనే బాలుడిని రక్షించి... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా సులువుగా పట్టుకున్నామని పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరించారు. 17 ఏళ్ల నిందితుడు పాత నేరస్థుడని తెలిపారు.
మాయమాటలు చెప్పి అపహరించాడు...
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న అర్జున్‌కు 17 ఏళ్ల బాలుడు మాయమాటలు చెప్పి అపహరించాడు. తర్వాత అర్జున్ తండ్రికి ఫోన్ చేసి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వగలనని వేడుకోగా అంగీకరించిన నిందితుడు.. అల్మాస్ గూడా కమాన్ దగ్గరకు డబ్బులతో రమ్మన్నాడు.
బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించగా.. పథకం ప్రకారం నిందితుడిని పట్టుకున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.