తెలంగాణ

telangana

ETV Bharat / city

KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ - తెలంగాణ వార్తలు

KRMB
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

By

Published : Sep 22, 2021, 6:06 PM IST

Updated : Sep 22, 2021, 6:44 PM IST

18:03 September 22

KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ

   కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ​ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును కూడా ఆపాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారని.. హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించారని లేఖలో ప్రస్తావించారు. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీలలోపే తీసుకోవాలని కోరారు. 

   మంగళవారం కూడా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా బేసిన్​కు తాము మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలన్న ఆంధ్రప్రదేశ్ నిరాధార వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్​కు తెలంగాణ మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పరిగణలోకి తీసుకోవాలని ఏపీ గతంలో కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దానిపై వివరణ ఇస్తూ తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ వాదన నిరాధారమైనదని... సహేతుకం కాని డిమాండ్​ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

శ్రీశైలం ఎడమకాల్వ టన్నెల్ ప్రాజెక్టు పట్టించుకోలేదు

    ఇప్పటివరకు కృష్ణానీరు ఇవ్వని ప్రాంతాలకు మాత్రమే గోదావరి నుంచి నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రస్తావించిన ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేపట్టిన ప్రాజెక్టులన్న తెలంగాణ... 150 టీఎంసీల సామర్థ్యంతో శ్రీశైలం ఎడమకాల్వ టన్నెల్ ప్రాజెక్టును ఉమ్మడి ఏపీ పట్టించుకోలేదని అన్నారు. అందువల్లే ఎస్సారెస్పీ మొదటి, రెండో దశలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే 150 టీఎంసీల శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి లక్షఎకరాలకు నీరిచ్చేలా లిఫ్ట్ స్కీమ్​లను ఉమ్మడి ప్రభుత్వాలు బచావత్ ట్రైబ్యునల్ ఎదుట అడగలేదని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్​లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల కంటే బేసిన్ వెలుపలున్న ఆంధ్రా ప్రాంతాలకు నీటిని మళ్లించే ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వాలని అప్పటి ఆంధ్రా ప్రభుత్వాలు కోరాయని లేఖలో తెలిపారు.

జలాలను వాడుకునే హక్కు తెలంగాణకు ఉంది

    ఇపుడు గోదావరి ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా తెలంగాణ మళ్లిస్తున్న నీటిలో వాటా కావాలని ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా కోరుతోందని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ గోదావరి నది నుంచి మళ్లిస్తున్న జలాలతో కృష్ణాలో మిగిలే నీటిని ఎగువనున్న ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చని అన్నారు. 1978 గోదావరి జలాల అంతర్ రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్ పైన ఈ జలాలను వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో టెలిమెట్రీ, తెలంగాణ మళ్లించే నీటిలో వాటా ఇవ్వాలన్న ఏపీ డిమాండ్ తగదని అన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా లేఖతో జతపరిచారు.

ఇదీ చదవండి:ఉగ్రవాదులతో లింకులు- ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

Last Updated : Sep 22, 2021, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details