వరుణుడు పగబట్టాడా అన్న రీతిలో హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎండ కాస్తూ.. పొడి వాతావరణం ఉంటూనే... సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లులు పడడం హైదరాబాద్‌లో సర్వసాధారణం. కానీ నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం... భాగ్యనగరాన్ని గజగజ వణికిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతటా కుంభవృష్టి కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆందోళనలో ప్రజలు..
ఈనెల 13న కురిసిన వర్షాల నుంచి ప్రజలు తేరుకోక ముందే తిరిగి శనివారం సాయంత్రం పడిన కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. ఇప్పటికీ వందల కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలున్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
అతిభారీ వానలు..
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ ప్రభావంతోనే కుండపోతగా వానలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎంతటి వర్షపాతాన్ని తట్టుకుంటుంది..
హైదరాబాద్‌లో 9వేల కిలోమీటర్ల మురుగునీటి వ్యవస్థ ఉన్నప్పటికీ.. కేవలం 1,500 కిలోమేటర్ల మేర మాత్రమే వరద ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంది. కేవలం 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే వ్యవస్థ ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ భారీ వర్షాలు పడితే....తీవ్ర ఆస్తినష్టం జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలాలు, చెరువుల కబ్జాల జరగకుండా.. ఇంటికో ఇంకుడుగుంత ఉంటే ఇలాంటి భారీ వర్షాలు పడినప్పుడు పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీచూడండి:'భారీ వర్షాలు పడే అవకాశం... అప్రమత్తంగా ఉండండి'