సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు.. ఇప్పటి వరకు బహుమతుల పేరిట మోసగించిన వారు.. కొత్తగా పెట్టుబడి పెడతా భాగస్వామిగా ఉండాలంటూ సామాజిక మాధ్యమంపై పరిచయమైన వ్యక్తికి గాలం వేశారు. నమ్మిన సదరు వ్యక్తి రూ.14 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేసే హైదరాబాద్ టోలిచౌకికి చెందిన మహమ్మద్ షోయబ్ ఖాన్‌కు దక్షిణాఫ్రికాకు చెందిన పార్క్ గియాన్ ర్యాంగ్ సామాజిక మాధ్యమంలో పరిచయమయ్యాడు. తాను ఇన్వెస్టర్ ఫర్ సౌత్ కొరియా సంస్థకు అధినేతగా పరిచయం చేసుకున్నాడు. తన వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించాలని ఉందని... మంచి వ్యాపార భాగస్వామి కోసం అన్వేషిస్తున్నానని నమ్మబలికాడు.
10 వేల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని.. భాగస్వామిగా ఉండాలని కోరి.. షోయబ్‌లో ఆశలు రేకేత్తించాడు. తనకు మంచి స్నేహితుడివని.. ఆ సొమ్మంతా పంపిస్తానని ఆశ చూపాడు. పూర్తి వివరాలు తన న్యాయవాది చెబుతాడంటూ ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు.
ఆ మాటలు నమ్మిన షోయబ్ అతనిని సంప్రదించాడు. పది వేల మిలియన్ డాలర్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పంపించాలి. అందుకు ఆర్బీఐకి కనీసం రూ.14 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఆ వ్యక్తి షోయబ్‌కు వివరించాడు. నిజమేనని నమ్మిన షోయబ్ ఆ మొత్తానంతా ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. అనంతరం వారి మధ్య ఫోన్ సంభాషణలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మోసపోయానని గ్రహించిన షోయబ్... హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి:తండ్రితో అక్రమ సంబంధం.. ఆస్తి గొడవ.. చంపేశాడు.!