MBBS Seats in Telangana: తెలంగాణకు మరో 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. జగిత్యాలలో కొత్తగా నెలకొల్పిన ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) అనుమతించింది. దీంతో ఈ సీట్లు జతయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వైద్య విద్య సంవత్సరంలో కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. జగిత్యాల సహా సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో వైద్య కళాశాలల నిర్మాణానికి (రూ.510 కోట్ల చొప్పున) ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ 8 కళాశాలల్లో తొలి విడత ఎన్‌ఎంసీ తనిఖీల ప్రక్రియ పూర్తయింది. లోపాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదిక పంపగా.. వాటిని సవరించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత తనిఖీలకు ఆహ్వానించింది.
గుడ్న్యూస్.. రాష్ట్రానికి మరో 150 ఎంబీబీఎస్ సీట్లు - MBBS Seats for jagtial medical college
MBBS Seats in Telangana : రాష్ట్రానికి మరో 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. జగిత్యాల వైద్య కళాశాలకు ఈ సీట్లు కేటాయిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపింది. మిగిలిన 7 కళాశాలలకూ త్వరలోనే అనుమతులు వస్తాయని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇందులో భాగంగా జగిత్యాలలో తనిఖీ నిర్వహించిన ఎన్‌ఎంసీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కళాశాలకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మంగళవారం అధికారికంగా లేఖ పంపింది. మిగిలిన 7 కళాశాలల్లో కొన్నింటిలో ఇప్పటికే రెండో విడత తనిఖీలు పూర్తికాగా.. మరికొన్నింటిలో ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వైద్యవర్గాలు తెలిపాయి. అన్ని కళాశాలలకూ ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు వస్తాయని, 2022-23 విద్యా సంవత్సరం నుంచే ఈ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎక్కడైనా పనులు అసంపూర్తిగా ఉన్నా వాటికి సంబంధించి ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరిస్తుందని, ఆ వైద్య కళాశాలల ప్రారంభానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆ వైద్యాధికారి పేర్కొన్నారు.