లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా శ్రమజీవుల బతుకు తెరవు బజారున పడింది. పనులు పూర్తిగా స్తంభించిన తరుణంలో.. రోజువారి కూలీలు, వలసకార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొట్ట చేతపట్టుకుని వచ్చిన వేలాది మంది..లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. భాగ్యనగరంలో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, స్థానికంగా చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న చాలా మంది బజారున పడ్డారు.
ఉచితంగానే..
లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వారెవ్వరు పస్తులుండ రాదన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంది. గతంలో అయిదు రూపాయల భోజన కేంద్రాలను నిర్వహించింది. ప్రస్తుతం వాటిని ఉచిత భోజనశాలలుగా మార్చేసింది. హరే కృష్ణ మూమెంట్, జీహెచ్‌ఎంసీలు రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత అన్నపూర్ణ కేంద్రాలు..లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన పేదల కడుపు నింపుతున్నాయి.
మూడు వందల కేంద్రాలు..
హైదరాబాద్‌తోపాటు.. మరో తొమ్మిది మున్సిపాలిటీల్లో దాదాపు మూడు వందల అన్నపూర్ణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇవే కాక నగర కూడళ్లల్లో మొబైల్ అన్నపూర్ణ వాహనాల ద్వారా ప్రభుత్వం భోజనం ప్యాకెట్లు సరఫరా చేస్తోంది. అటు మధ్యాహ్నం, ఇటు రాత్రి రెండు పూటల కలిసి దాదాపు రెండు లక్షల మందికి కడుపు నింపుతున్నాయి.