రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయిలో రైతు ఉత్పత్తుల కంపెనీలను సెర్ప్ ప్రతినిధులు ఏర్పాటు చేశారు. నేరుగా రైతుల వద్ద నుంచి కూరగాయలు, పండ్లు సేకరించి పెద్దపెద్ద రిటైల్ చైన్ మార్కెట్లకు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాటిని హైదరాబాద్‌లోని రిటైల్ మార్కెట్లకు అమ్మి... 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
ఎనిమిది జిల్లాల్లో కార్యకలాపాలు షురూ..
గత వేసవిలో మామిడి పండ్లను సేకరించి విక్రయించారు. ఇటీవల నారాయణపేట జిల్లాలో సీతాఫలాలను సేకరించి వాటి నుంచి గుజ్జు తీసి ఐస్‌క్రీమ్ కంపెనీలకు సరఫరా చేశారు. మండల, జిల్లా రైతు ఉత్పత్తుల కంపెనీలకు కేంద్రంగా రాష్ట్ర రైతు ఉత్పత్తుల కంపెనీని ఇటీవల బెనిషాన్ పేరిట ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
కమీషన్లు, హమాలీ ఛార్జీలు తగ్గాయి
గతంలో మార్కెట్లకు వెళ్తే సరైన గిట్టుబాటు ధర వచ్చేది కాదని, అందులోనూ కమీషన్లు, హమాలీ ఛార్జీలు అంటూ వెళ్లేవని.. ఇపుడా పరిస్థితి లేదని బెనిషాన్ సభ్యులు చెబుతున్నారు. తమకు సమయం కూడా కలిసి వస్తోందంటున్నారు.