నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచి నిరంతరం పని చేయడంలోనే సాంత్వన పొందిన అన్నదాత మాజీ సంపాదకుడు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (93) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఛాతీ నొప్పి లక్షణాలతో గురువారం కేర్ ఆస్పత్రికలో చేరిన ఆయన శుక్రవారం ఉదయం 5గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
బీవీఎస్సీ డిగ్రీ
కృష్ణా జిల్లా వీరులపాడులో 1927 ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు జన్మించిన డా.నారాయణరావు... నందిగామ, గుంటూరులో ఉన్నత విద్యను అభ్యసించి 1952లో మద్రాసు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ డిగ్రీ పొందారు. ఇజత్నగర్లోని ఇండియన్ వెటరినరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీజీ చేశారు. కొలంబోప్లాన్ కింద 1960లో పశుపోషణలో అధ్యయనం కోసం భారత ప్రభుత్వం వీరిని ఆస్ట్రేలియా పంపించింది. అక్కడ డెయిరీ ఫారాల నిర్వహణపై శిక్షణ పొందారు.
అన్నదాత సంపాదకులుగా
1952 నుంచి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. పశుసంవర్ధక శాఖ సంచాలకులుగా పని చేసి 1985లో పదవీ విరమణ చేశారు. పనిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలనే లక్ష్యంతో విశ్రాంత జీవితంలోనూ రైతు సేవలో తరించాలని భావించి 1985 నుంచి ఈనాడు గ్రూపులో చేరారు. 1987 నుంచి 2017 అక్టోబరు వరకు మూడు దశాబ్దాల పాటు దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న వ్యవసాయదారుల మాసపత్రిక "అన్నదాత" సంపాదకులుగా అపారమైన సేవలు అందించారు.