హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్‌కు తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డికి పట్టిన గతే.. ఉప ఎన్నికలో ఈటలకు పడుతుందన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిసగా పేర్కొనడం.. ఈటల అహంకారానికి నిదర్శనమన్నారు. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చిన్న పిల్లవాడు కావచ్చు కానీ.. మొదట పోటీ చేసినప్పుడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడేనని తలసాని పేర్కొన్నారు.
ఈటల హుజూరాబాద్‌లో బీసీ.. శామీర్‌పేటలో ఓసీ అని తలసాని ఆరోపించారు. ఉద్యమకారులకు తెరాస మొదట్నుంచీ ప్రాధాన్యతనిస్తోందన్న తలసాని.. గతంలో సుమన్, కిశోర్ తదితరులకు అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్‌కు కూడా అదేవిధంగా కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారన్నారు. గతంలో ఆరు సార్లు కేసీఆర్ దయాదాక్షిణ్యాల పైనే ఈటల విజయం సాధించారన్నారు. భాజపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇది భావ్యం కాదన్నారు.
పేద వర్గాల బిడ్డ, చదువుకున్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అని ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. బానిస అని అనడం దారుణం. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో నోముల భగత్‌పై కూడా ఇలాంటి వ్యాఖ్యాలు చేశారు. 40 ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న జానారెడ్డినే ఓడగొట్టారు. ఈటల ఎంత..?
-తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ మంత్రి