Lumpy skin disease is spreading in Telangana: తెలుగురాష్ట్రాల్లోని పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి ఎల్ఎస్డీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ముద్ద చర్మ వ్యాధి కేసులు నమోదవుతుండటంతోపాటు.. 80 వేలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి ఆ వ్యాధి ప్రవేశించడం ద్వారా ఆవు, గేదె జాతి పశువుల్లో తీవ్రప్రభావం చూపుతోంది.
జాగ్రర్త చర్యలు:ప్రాణాంతక లంపీస్కిన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వ్యాధినిరోధక చర్యలకు ఉపక్రమించాయి. రోగ లక్షణాలు గల పశువులను గుర్తించి పశు వైద్యులు టీకాలు వేస్తున్నారు. ఇతరరాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదా అనారోగ్యంగా ఉన్న ఆవులు, గేదెలకు తగిన చికిత్స అందిస్తూ ఐసోలేషన్‌లో పెట్టి మిగతా మందలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
టీకాతో అరికట్టవచ్చు:సాధారణంగా వ్యాధి విస్తరించిన తర్వాత నివారణ కష్టం. ఐసీఏఆర్ అనుబంధ పిస్తార్ బరేలీ జాతీయ పశు పరిశోధన సంస్థలు సంయుక్తంగా లంపీ ప్రోవ్యాక్స్ ఇండ్ పేరిట టీకా రూపొందించినట్లు సెప్టెంబరు 10న మోదీ సర్కారు ప్రకటించింది. ఐతే ఆ టీకా ఇప్పుడు అందుబాటులోకి వచ్చే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేయడంతోపాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం వల్ల ముద్దచర్మ వ్యాధిని అరికట్టవచ్చని పాడిరంగ నిపుణులు సూచిస్తున్నారు.