కరణ్ ఆచార్య... చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ అతడు గీసిన ‘యాంగ్రీ హనుమాన్’ యానిమేషన్ స్టిక్కర్లని మాత్రం చూడని వారుండరు. దేశవ్యాప్తంగా కార్లూ బైక్‌ల మీద ఎక్కడ చూసినా హనుమంతుడు కోపంగా చూస్తున్నట్లున్న ఈ స్టిక్కర్లే కనిపిస్తున్నాయి మరి. టీషర్టులూ వాచ్‌లూ ఫోన్లూ ల్యాప్టాప్లలాంటి వాటిమీదికీ చేరి ఈ బొమ్మ ఫ్యాషన్ సింబల్‌గానూ మారడంతో ప్రధాని మోదీ కూడా మంగళూరు వచ్చినపుడు కరణ్ ఆచార్యను యూత్ ఐకన్‌గా అభివర్ణించారు.
ఇక, ప్రస్తుత విషయానికొస్తే ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు అతడు ఫొటోఎడిటింగ్ చేసినవి. కొన్ని రోజుల కిందట ఓ చిన్నారి ఫొటోను బాల కృష్ణుడు కాళీయ మర్దనం చేస్తున్నట్లు మార్చి 2.5 లక్షల ఫాలోవర్లు ఉన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు కరణ్. దానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. కొందరు అభిమానులు అతడిని మెచ్చుకోవడంతోనే ఆగకుండా ‘మా బుజ్జిగాడి ఫొటోను కూడా కృష్ణుడిలా మారుస్తారా..? మా పాపాయిని ఝాన్సీలక్ష్మీబాయిలా చూపించగలరా..?’ అంటూ ఇన్‌స్టా, ట్విటర్లలో కరణ్‌కి మెసేజ్‌లు పెట్టారు. వాళ్లు కోరినట్లే ఫొటోలను ఎడిట్ చేసి కరణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయిపోయాయి.