ఈ రాష్ట్రం వారు వద్దంటే.. ఆ రాష్ట్రం వారు కావాల్సిందే అంటారు..! మీ ప్రాజెక్టులు అక్రమమని ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తే... కాదు కాదు మీ ప్రాజెక్టులే అక్రమ నిర్మాణాలంటూ మరో ప్రకటన. విద్యుదుత్పత్తి అపాలని ఏపీ సర్కార్.. ఆపేదే లేదంటూ తెలంగాణ..! అధికార పార్టీ నేతలే కాదు.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఫైర్ అయ్యారు. ఏపీ మంత్రులు మాట్లాడితే.. తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు మాట్లాడితే... ఏపీ మంత్రులు, అధికార పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. పోలీసుల పహారాతో ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి..! ఇదీ గత కొన్నాళ్లుగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం..! తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను కూడా ఆశ్రయించింది. ఇలా వాటర్ వార్ జరుగుతున్న క్రమంలో... కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి ఓ గెజిట్‌ను కూడా జారీ చేసింది. మరీ జల్‌శక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ఏంటీ..? ఈ నోటిఫికేషన్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మాట ఎలా ఉంది..? ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారమైనట్లేనా..?
ఒక్క నది.. నాలుగు రాష్ట్రాలు..
కృష్ణా నదీ జలాలపై వివాదం చాలాకాలంగా ఉంది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ఉండేది. ప్రస్తుతం అది మహారాష్ట్ర, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదంగా మారింది. ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపొతల పథకం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణమని.. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లెవనెత్తింది. కాదు.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందనేది ఏపీ ప్రభుత్వ వాదన. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని.. ఏపీ సర్కార్ గళమెత్తింది. సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశమని తేల్చిచెబుతోంది.
లేఖాస్త్రాలు
కానీ తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించటంతో పాటు వెంటనే ఆపేయాలని కోరింది. రాయలసీమ ఎత్తిపోతలు ఒక్కటే కాకుండా, ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించాలని కృష్ణా బోర్డుని ఏపీ జలవనరుల శాఖ కోరింది. ఈ పరిశీలనపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలు కూడా రాసింది. అదే సమయంలో కమిటీని నియమించి, రాయలసీమ ఎత్తిపోతల పనుల పరిశీలనకు సిద్ధమయిన కేఆర్ఎంబీ ఛైర్మన్ వైఖరిని ఏపీ తప్పుబట్టింది. ఛైర్మన్‌ని తొలగించాలని కూడా జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఇలా నడుస్తున్న వ్యవహరంలో శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద తెలంగాణ ప్రభుత్వం.. విద్యుదుత్పత్తిని కొనసాగించటం కొత్త వివాదానికి దారి తీసింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. విద్యుదుత్పత్తిని చేపట్టడం సరికాదంటూ తెలంగాణ సర్కార్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ అంశాలపై ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి లేఖలు రాశారు. తక్షణమే తెలంగాణ చర్యలను ఆపాలని జగన్ కోరారు.
వివాదంలో కీలక మలుపు