తెలంగాణ

telangana

ETV Bharat / city

భూముల రీ-సర్వేకు సిద్ధమవుతున్న ఏపీ సర్కారు - Andhra Prdesh government-preparing-for-land-re-survey

ఏపీ వ్యాప్తంగా భూముల రీ-సర్వే కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. గ్రామస్థాయిలో జరిగే ఈ ప్రక్రియ కోసం అక్కడి సచివాలయాల్లోని సర్వేయర్లకు శిక్షణ ఇప్పిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో సాగే ఈ రీ-సర్వే ద్వారా భూముల లెక్కలు కచ్చితంగా తేలనున్నాయి. వందేళ్ల తరువాత సమగ్రంగా సర్వే జరుగుతుండటం వల్ల వివాదాలకు తెర పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Andhra Prdesh government-preparing-for-land-re-survey
భూముల రీ-సర్వేకు సిద్ధమవుతున్న ఏపీ సర్కారు

By

Published : Nov 5, 2020, 9:22 AM IST

గట్టు తగాదాలు, గుట్ట వివాదాలు.. పొలంలోకి రోడ్డు వచ్చిందని ఒకరు.. స్థలం ఆక్రమించారని మరొకరు ప్రతి సోమవారం ఏపీలో జరిగే స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల్లో 70శాతం ఇలాంటివే..! ఆంధ్రప్రదేశ్​లో భూములకు సంబంధించి సమగ్రమైన విధానం లేకపోవటమే దీనికి కారణం. ఎప్పుడో బ్రిటీషర్ల కాలంలో 1906 నుంచి 1922 వరకూ రాష్ట్రంలో భూముల సర్వే జరిగింది.

అక్కడక్కడ కొన్ని గ్రామాలు మిగిలిపోగా 1960లో వాటినీ పూర్తిచేశారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ జనాభా పెరిగింది. భూములూ ఎందరో చేతులు మారి ఉంటాయి. అడవులు సాగుభూములుగా మారగా.. వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలు జనావాసాలుగా మారిపోయాయి. అందుకే భూముల రీ-సర్వేతో మొత్తం భూలెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న రీ-సర్వే మూడు విడతలుగా జరగనుంది. మొత్తం 27నెలల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయ విధానాల్ని పక్కనబెట్టి అధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు.

ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్, డీజీపీఎస్ వంటి పరికరాలతో సర్వే చేయటంతో పాటు ఆటో క్యాడ్ సాఫ్ట్‌వేర్ సాయంతో కచ్చితమైన మ్యాపింగ్ చేయనున్నారు. దీనిని కార్స్ సిస్టం సర్వేగా వ్యవహరిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో నియమించిన సర్వేయర్లకు ఈ రీ-సర్వేపై డివిజన్ల వారీగా శిక్షణ ఇస్తున్నారు. వందేళ్ల కిందట సర్వేలో పాల్గొన్న వారి పేర్లు పాత రికార్డుల్లో ఉండగా.. ఇప్పుడు పాల్గొనేవారికీ అదే అవకాశం దక్కనుంది.

డీజీపీఎస్ విధానంలో ఉపగ్రహాల సాయంతో సరిహద్దులు కచ్చితంగా గుర్తించటం సాధ్యమౌతుందని.. రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలోనే భూతగాదాల పరిష్కారమూ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా భూ వివాదం వస్తే కొలతలకు సర్వేయర్లను తీసుకెళ్లటం రైతులకు, భూ యజమానులకు పెద్ద ప్రహసనంలా మారింది. కొత్తగా భూమి కొన్నవారు 1-బి, అడంగల్​లో చేర్చాలన్నా సర్వే తప్పనిసరి. ఇలాంటి ఇబ్బందులకు రీ-సర్వేతో పరిష్కారం లభిస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ:టీఎస్​బీపాస్ ప్రారంభానికి రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details