ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల పరిస్థితులను వివరిస్తూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ రాసినట్లుగా ఉన్న ఒక లేఖ బుధవారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో తనకు, తన కుటుంబానికి ఎలాంటి భద్రతా లేదని... కేంద్రప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలని... ఇక్కడి పాలకుల్లో ఉన్నతస్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్ చరిత్ర, కక్షసాధింపు వైఖరితో ఈ నిర్ణయానికి వచ్చానని ఆ లేఖలో రమేశ్‌కుమార్ పేర్కొన్నట్లుగా ఉంది.
లేఖలో వివరాలు ఇలా
ఆ లేఖలో ఉన్న విషయాలు యథాతథంగా ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో నాకు, నా కుటుంబానికి భద్రత విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ సమయంలో నేను హైదరాబాద్‌లో ఉండటమే కొంత సురక్షితం. అలాగని పూర్తిగా కాదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కార్యాలయంలోనే పోలీసుల రక్షణలో ఉంటున్నాను. పూర్తి రక్షణ లేకుండా బయటకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నాను. ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతే నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుంది. నా శ్రేయోభిలాషులు, నాతో కలిసి పనిచేసేవారు, భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారూ నన్ను జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. నాకు వస్తున్న బెదిరింపులపై రాష్ట్ర యంత్రాంగానికి పూర్తి అవగాహన ఉన్నట్లు లేదు. నాపైనా, నా కుటుంబసభ్యులపైనా భౌతికదాడులు చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుత పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహన వైఖరి, ప్రతీకారేచ్ఛలను పరిగణనలోకి తీసుకుని నాకు, నా కుటుంబసభ్యులకు ఆపద ఏర్పడిందని ఆందోళన చెందుతున్నాను. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖను శరణు కోరడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కేంద్ర రక్షణ బలగాలను అందించి మాకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఈ రక్షణ ఏర్పాట్లు కొనసాగాలి. ఈ సర్కారు నాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వారి అనుయూయులు, నేరగాళ్లు నాపై దాడికి సిద్ధంగా ఉన్నారు. వారి నేరచరిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ బాధాకరమైన అభిప్రాయానికి వచ్చాను ’’.. అని లేఖలో ఉంది.
'మీరు తక్షణమే నాకు రక్షణ ఏర్పాట్లు చేయగలిగితే కనీసం మిగిలిన ఎన్నికల ప్రక్రియనైనా కొంత స్వేచ్ఛగా నిర్వహించేందుకు వీలుంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి పూర్తిన్యాయం చేయగలను. అప్పుడు తక్షణమే నా విధులను చట్టప్రకారం, సమయానుగుణంగా నిర్వహించేందుకు వీలుంటుంది. మీరు సానుకూల నిర్ణయం తీసుకుంటే ఆత్మవిశ్వాసంతో నా ధర్మాన్ని నిర్వహిస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ప్రకటనను మార్చి 7న విడుదల చేశాం. ఎన్నికల ప్రకటనకు ముందే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీఐజీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించాను. రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు, హింస జరగకుండా ఉండేందుకు రక్షణ చర్యలు కల్పిస్తామని, బలగాలను అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోలీసుశాఖ మీద నేను పెట్టుకున్న అంచనాలన్నీ తొలిదశ నామినేషన్ల నాటికే తారుమారయ్యాయి. చిన్న, పెద్ద ప్రతిపక్షపార్టీలన్నీ ముక్తకంఠంతో గగ్గోలు పెట్టినట్లే పోలీసుల సాయంతో అధికార పార్టీ హింసకు, బెదిరింపులకు పాల్పడింది. దాదాపు 35 చోట్ల నామినేషన్లను అడ్డుకోవడం, 23 చోట్ల బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెదేపాను, భాజపా-జనసేన కూటమిని లక్ష్యంగా చేసుకుని 55 చోట్ల దాడులు జరిగాయి. ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించారు. ఎప్పుడూ లేనంత స్థాయిలో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని లేఖలో ప్రస్తావించారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్సును తీసుకొచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేరాలకు పాల్పడేవారికి మూడేళ్ల జైలుశిక్ష, 10వేల రూపాయల జరిమానా, ఎన్నికల్లో అనర్హత వేటు వేసేలా ఈ ఆర్డినెన్సు వీలు కల్పిస్తోంది. వాళ్ల ఇళ్లలో మద్యం, నగదు దొరికితే ఎన్నికల్లో గెలిచినవారినీ అనర్హులను చేయొచ్చు. తమను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ ఆర్డినెన్సును తెచ్చారని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. వారి వాదనకు బలం చేకూర్చేలా అధికార పార్టీవారు ప్రతిపక్ష అభ్యర్థులు, నాయకుల ఇళ్లలో మద్యం సీసాలుంచి పోలీసులను పంపి అరెస్టు చేయించిన ఉదంతాలూ వెలుగులోకి వచ్చాయి. రాజకీయ పక్షాలు ప్రచారానికి వెళ్లడానికే భయపడే పరిస్థితి ఉంది. ఈ హింసతో ఎప్పుడేం జరుగుతుందో అనే మానసిక ఆందోళనతో పోలింగ్ శాతం పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న కరోనా భయంతో ఎగువ, ఉన్నతస్థాయి ప్రజలు పోలింగు కేంద్రాలకు వెళ్లే పరిస్థితీ లేదు. 70 శాతం పంచాయతీలు ఏకగ్రీవాలు చేసుకునేలా అధికారపార్టీ వ్యూహం రచించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో హింసను అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టింది. మరోవైపు కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, జనం పెద్ద ఎత్తున ఒకచోట గుమిగూడకూడదనే ఆదేశాలతో ఈ ఎన్నికల దృశ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగితే భారీగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చే అవకాశం ఉండటంతోపాటు బ్యాలెట్ పేపర్ల వినియోగంతో ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. జాతీయ యంత్రాంగం సూచనలు, కేంద్ర వైద్యారోగ్య నిపుణుల సలహాలు తీసుకున్నాక... ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయమే తీసుకుంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఎన్నికల కమిషన్లు ఎన్నికలను వాయిదా వేశాయి. కానీ ఏపీలో అధికారపక్షానికి తమ వ్యూహం ప్రకారం అంతా నడవట్లేదనే భయం ఈ నిర్ణయంతో మొదలైంది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ చర్యలనే సమర్థించింది. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మాత్రం ఎత్తివేయాలని సూచించింది... అని ఆ లేఖలో పేర్కొన్నారు.