ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పే అండ్ ప్లే విధానం వల్ల క్రీడాకారులు మైదానంలో ప్రత్యర్థుల్నే కాదు, ఆర్థిక భారాన్ని సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం తెచ్చిన జీవోకు సవరణలు చేస్తు ఒక్కో క్రీడకు ఒక్కో ధర వసూలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ నిర్ణయం మధ్యతరగతి, పేద క్రీడాకారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని....క్రీడారంగ నిపుణులు, క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో ఆటకు.. ఒక్కో ధర..
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 'శాప్' తాము నిర్వహించే పోటీల్లో క్రీడాకారుల నుంచి కొంత మొత్తం వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం పేద క్రీడాకారులకు భారంగా మారుతోంది. జీవో నంబర్ 20 ప్రకారం ఒక్కో ఆటకు ఒక్కో ధరను నిర్ణయించే అధికారం కలెక్టర్‌లకు ఇచ్చారు. శాప్ పరిధిలో నిర్వహించే హాకీ, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్ బాల్, సైక్లింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ వంటి 19 రకాల క్రీడలకు రుసుం వసూలు చేయాలని శాప్ ఆదేశాలు జారీచేసింది.