తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం.. భయాందోళనలో ఉద్యోగులు - corona cases in andhra pradesh

రోజురోజుకు పెరుగుతున్న కరోనా ఉద్ధృతి ఏపీ సచివాలయ ఉద్యోగులను భయపెడుతోంది. తాజాగా ఆర్థికశాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో.. ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. కొవిడ్ కారణంగా సీఎస్ సహా కొందరు ఉన్నతాధికారులు ఇప్పటికే సచివాలయానికి రాకపోవటంతో.. ఇంటి నుంచి పని చేసేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

corona in ap secretariat
ఏపీ సచివాలయ ఉద్యోగులకు కరోనా

By

Published : Apr 17, 2021, 10:49 PM IST

ఏపీ సచివాలయ ఉద్యోగి తాజాగా కరోనా మహమ్మారితో మరణించడంతో.. మిగిలిన సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. సాధారణ పరిపాలనశాఖ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్, విద్యాశాఖ విభాగాల్లో.. ఇప్పటికే 50 మందికి పైగా కరోనా సోకడం, పలువురు ఉన్నతాధికారులు వైరస్ బారిన పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్​గా తేలిన ఉద్యోగుల కుటుంబ సభ్యులూ కొవిడ్​తో ఇబ్బందులు పడుతుండటం.. మరింత భయం గొలుపుతోంది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులకు కరోనా పాజిటివ్ రావడంతో.. వారు సచివాలయం వైపు కన్నెత్తి చూడటం లేదు. విజయవాడ, గుంటూరుల్లోని హెచ్​వోడీ కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. సచివాలయానికి వచ్చేందుకు ఉద్యోగులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. కొందరు ఉద్యోగులు మినహా మిగతావారు సచివాలయానికి వచ్చేందుకు జంకుతున్నారు.

రాష్ట్రంలో కరోనా స్థితి రోజురోజుకీ తీవ్రం అవుతున్న దృష్ట్యా.. ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘంపై సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. కుదరని పక్షంలో రోజు విడిచి రోజు వచ్చేందుకు అనుమతించేలా చూడాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పరిస్థితి చేయిదాటక మునుపే వేగంగా స్పందించాలని కోరుతున్నారు. వైరస్ ఉద్ధృతి పెరగడంతో.. సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రతి శుక్రవారం ఉద్యోగులతో పాటు అధికారులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజు 200 మంది ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి:'దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి'

ABOUT THE AUTHOR

...view details