Chalo Vijayawada: ఏపీలో ఉద్యోగుల ఉద్యమం ఉత్కంఠ స్థాయికి చేరింది. నేటి చలో విజయవాడకు ఉద్యోగ నేతలు రాకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వం కట్టడి చేశారు. చలో విజయవాడకు అనుమతి లేదని, అందులో పాల్గొనేందుకు వెళ్తే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను హెచ్చరిస్తూ నోటీసులిచ్చింది. విజయవాడకు దారితీసే అన్ని మార్గాలనూ దిగ్బంధించింది. అత్యవసర వైద్య కారణాలైతే తప్ప ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గురువారం సెలవులు ఇవ్వద్దని పలు జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు. పీఆర్సీ సాధన సమితి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. చలో విజయవాడకు వెళ్లొద్దని వారందరికీ నోటీసులు ఇచ్చారు. కొంతమంది ముఖ్య నాయకుల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.నారాయణరెడ్డి, యూటీఎఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరిని గృహనిర్బంధం చేశారు. ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఖజానా అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌కుమార్‌ను నిర్బంధించి నోటీసులిచ్చారు. ఏపీ పలు జిల్లాల్లోనూ అక్కడి ముఖ్య నేతలను నిర్బంధించారు.
మారువేషాల్లో బయల్దేరి..
పోలీసుల నిర్బంధాల్ని తప్పించుకుని విజయవాడకు చేరుకునేందుకు పలు జిల్లాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు మారువేషాల్లో బయల్దేరారు. కూలీల మాదిరిగా, బురఖాలు వేసుకుని.. ఇలా పలురకాలుగా రైళ్లలో ప్రయాణించారు.
చర్యలకు బాధ్యులవుతారు
‘11వ పీఆర్సీకి వ్యతిరేకంగా మీరు చలో విజయవాడ వెళ్తున్నారని, అక్కడ ఎక్కువమంది గుమిగూడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారేమోనని, ఏదైనా నేరానికి పాల్పడతారేమోనని మాకు ముందస్తు సమాచారం ఉంది. ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. అందుకే మిమ్మల్ని ముందస్తుగా నిర్బంధిస్తున్నాం’ అని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులుకు అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నోటీసులిచ్చారు. ఈ తరహా నోటీసులు అన్ని జిల్లాలు, మండలాల్లోని ముఖ్య నాయకులకు ఇచ్చారు. చిత్తూరు, తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో ఉపాధ్యాయులు ఎక్కడికీ వెళ్లకుండా కానిస్టేబుళ్లను పాఠశాల వద్దే కాపలా పెట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న ఉద్యోగుల్ని పెన్నా అహోబిలం వద్ద ఉరవకొండ పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి ఆర్టీసీ బస్సులో బయల్దేరిన 60 మందిని అరెస్టు చేయడంతో వారు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.
- ఏపీలో నలుమూలల నుంచి విజయవాడ వైపు దారితీసే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. చెన్నై-కోల్‌కతా రహదారిపై విశాఖ జిల్లా కాగిత టోల్‌గేట్ వద్ద పోలీసులు గస్తీ కాసి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులకు వాహనాలు ఇవ్వొద్దని ట్రావెల్ ఏజెన్సీలను హెచ్చరించారు. తిరువూరు నుంచి ఇబ్రహీంప్నటం వరకూ 5 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు.
- ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎవరెవరు సెలవులో ఉన్నారు, ఎవరు గైర్హాజరయ్యారనే అంశాలపై చిత్తూరు జిల్లాలో వివరాలు సేకరించారు.
ఇదీచూడండి:Telangana Budget 2022: రాష్ట్ర బడ్జెట్ కసరత్తు వేగవంతం.. దళితబంధుకు రూ. 20 వేల కోట్లు?