తెలంగాణ

telangana

ETV Bharat / city

visakhapatnam beach: విశాఖలో మరో పది బీచ్‌ల అభివృద్ధి! - ఏపీలో పర్యాటక ప్రాంతాలు

విశాఖలో మరో పది బీచ్​లు అభివృద్ధి చేయనున్నారు. విశాఖ పోర్టు సాయంతో తొలిదశలో ఐదు అభివృద్ధి చేస్తారు. ఒక్కో బీచ్‌లో రూ.2.50 కోట్లతో సదుపాయాల కల్పనకు ఏపీటీడీసీ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఆమోదం తెలిపింది.

visakhapatnam beach
visakhapatnam beach

By

Published : Jul 17, 2021, 12:22 PM IST

విశాఖలోని రుషికొండ - భోగాపురం మధ్య మరో పది బీచ్‌ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వ ఆమోదం లభించింది. ఒక్కో బీచ్‌ను రూ.2.50 కోట్లతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది. విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సమకూర్చే నిధులతో తొలిదశలో ఐదు బీచ్‌లను సిద్ధం చేయనున్నారు. రెండోదశలో మిగిలినవి అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే ఆర్కే బీచ్, రుషికొండ, యారాడ బీచ్‌లు ఉన్నాయి.

విశాఖపట్నం నుంచి భీమునిపట్నం మీదుగా భోగాపురం వరకు ఆరు వరుసల రహదారి అభివృద్ధిలో భాగంగా తీరం వెంబడి కొత్త బీచ్‌లు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఇందులో భాగంగా తీర ప్రాంత నియంత్రణ జోన్‌ నిబంధనలకు లోబడి ఆయా బీచ్‌ల్లో తాత్కాలిక నిర్మాణాలతో సదుపాయాలు కల్పించనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు చెప్పారు.

కొత్త బీచ్‌లు ఇవే

1. సాగర్‌నగర్, 2. తిమ్మాపురం, 3. మంగమూరిపేట, 4. చేపలుప్పాడ, 5. ఐఎన్‌ఎస్‌ కళింగ, 6. ఎర్రమట్టి దిబ్బలు, 7. భీమునిపట్నం, 8. నాగాయంపాలెం, 9. అన్నవరం, 10. కంచరపాలెం

కల్పించే సదుపాయాలు

ఫుడ్‌ కోర్టులు, పిల్లల క్రీడా పార్కులు. నడక మార్గాలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరికరాలు, స్నానాల గదులు, తాగునీటి సదుపాయం, సురక్షిత స్విమ్మింగ్‌ జోన్లు, బీచ్‌ క్రీడలు, వాచ్‌ టవర్, సీసీ టీవీ కంట్రోల్‌ రూం, ప్రాథమిక వైద్యం.

కొత్త ప్రాజెక్టులకు ఆస్కారం

విశాఖ - భోగాపురం తీర ప్రాంతం పొడవునా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్, బుద్ధిస్ట్​ పర్యాటకాన్ని పెంచడం, రీక్రియేషన్‌ టూరిజం కోసం ఉల్లాస పార్కులు, స్కై టవర్, టన్నెల్‌ అక్వేరియం వంటివి అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత విలాసవంతమైన హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు.

త్వరలో పనులు ప్రారంభం

విశాఖలో కొత్త బీచ్‌లను గుర్తించాం. వాటి అభివృద్ధికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మొదటిదశలో అభివృద్ధి చేయాల్సిన వాటిపై దృష్టి సారించాం. అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తాం. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దుతాం. రుషికొండ బ్లూ ఫ్లాగ్‌ ప్రాజెక్టు మాదిరి మిగిలిన వాటినీ అభివృద్ధి చేస్తాం. విశాఖలో మరికొన్ని బీచ్‌లను బ్లూ ఫ్లాగ్‌ కోసం ప్రతిపాదనలు పంపుతాం.

- ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏపీ పర్యాటకశాఖ మంత్రి

ఇదీచూడండి:NALLAMALA FOREST: జీవవైవిధ్యంతో అలరారుతోన్న అందాల నల్లమల

ABOUT THE AUTHOR

...view details