Gowtham Reddy : గుండెపోటుతో సోమవారం కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి ప్రత్యేక విమానం ద్వారా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు తీసుకువచ్చారు. అక్కడినుంచి డైకస్ రోడ్డులోని మేకపాటి స్వగృహంలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహన్ని ఉంచారు. ఆయన నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేకపాటి చివరి చూపు చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. బుధవారం ఉదయం నెల్లూరు నుంచి ఉదయగిరికి భౌతికకాయాన్ని తరలిస్తారు.
నెల్లూరులో మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయ సందర్శన, అంత్యక్రియల ఏర్పాట్లను ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర రోడ్డు మార్గంలో ఉదయగిరి వరకు జరుగుతుందని మంత్రి అనిల్ తెలిపారు. అంత్యక్రియలకు ఏపీ సీఎం జగన్ సహా మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలంతా హాజరవుతారని అనిల్ తెలిపారు.
ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపు..
మంగళవారం ఉదయం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి... అక్కడినుంచి ఎయిర్ అంబులెన్స్‌లో నెల్లూరు తరలించారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఎయిర్ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులతో పాటు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. మరోవైపు ఇప్పటికే అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి బయల్దేరారు. ఈ సాయంత్రానికి ఆయన చేరుకునే అవకాశముంది. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.