ఏపీ పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల ఏపీ పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు. 2019 ఓటరు జాబితాతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త జాబితా ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 3.6 లక్షలమంది కొత్త ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే
"ప్రజల చేతికి అధికారం ఇచ్చేందుకే స్థానిక సంస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే అందరం వ్యవహరించాలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నా వ్యక్తిగత వ్యవహారం కాదు. ఎన్నికలు వాయిదా వేయాలన్న వాదనల్లో హేతుబద్ధత కనిపించట్లేదు. ఎన్నికల నిర్వహణపై గవర్నర్ నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందని భావిస్తున్నా. ఎన్నికల వల్ల స్థానిక నాయకత్వం బలపడుతుంది. విధులు, నిధులు, అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యం. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. ఐజీ స్థాయి అధికారితో ఏకగ్రీవాలపై దృష్టి పెడతాం. "
- నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఏపీ ఎస్ఈసీ
ప్రభుత్వం సహకరించాలి
ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నాయని నిమ్మగడ్డ తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కోర్టుకు వెళ్లామన్నారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉదాశీనతను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. కమిషన్‌లో కొంతమందే ఉన్నా సమర్థంగా పనిచేస్తున్నారని చెప్పారు. సిబ్బంది కొరత ఉన్నా కమిషన్ పనితీరులో అలసత్వం ఉండదని... ఈ ఎన్నికల నిర్వహణ కమిషన్‌కు పెనుసవాలే అని వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు భిన్న వాదనలు వినిపించాయని... దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదని ఎస్ఈసీ సూచించారు. ఉద్యోగులు ప్రజాసేవకులు... దానిని విస్మరిస్తే దుష్ఫలితాలు ఉంటాయన్నారు. ఎన్నికలు సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని... అవసరమైతే సుప్రీంకోర్టుకు రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తామని పేర్కొన్నారు. ఈ పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకమన్నారు.
అది.. కమిషన్ విధి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ముందుకే వెళ్తున్నామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధిగా పేర్కొన్నారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా.. అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ మానసపుత్రికే ఎన్నికల సంఘం అని అభివర్ణించారు. ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పాటిస్తామన్నారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు
- జనవరి 25న నామినేషన్ల స్వీకరణ
- జనవరి 27 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
- జనవరి 28న నామినేషన్ల పరిశీలన
- జనవరి 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
- జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం
- జనవరి 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
- జనవరి 31న పోటీలోని అభ్యర్థుల జాబితా విడుదల
- ఫిబ్రవరి 5న పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
- ఫిబ్రవరి 5న సా. 4 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
- ఫిబ్రవరి 5న సాయంత్రం ఉపసర్పంచి ఎన్నిక