ఏపీ ప్రభుత్వం అప్పుల మోత మోగిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే భారీ రుణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు (11 నెలల్లో) రూ.79,191 కోట్ల అప్పులు తీసుకున్నట్లు కాగ్ లెక్కలు వెల్లడించాయి. దేశంలో ఆర్థికంగా, జనాభాపరంగా పెద్దగా ఉన్న 14 రాష్ట్రాల్లో ఏదీ ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో పొందుపరిచిన అంచనాలతో పోలిస్తే 63.97% మేర రుణాలు అధికంగా సేకరించింది.
కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలూ దాదాపు ఒకేస్థాయిలో (60%దాకా) ఉన్నప్పటికీ అప్పుల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అన్నింటినీ మించిపోయింది. కాగ్ లెక్కలను విశ్లేషిస్తే ఏపీ ఈ 11 నెలల్లో నెలకు సగటున రూ.7,199 కోట్లు రుణం సేకరించినట్లు అర్థమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఉన్న రూ.52,090 కోట్ల అప్పుతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి అప్పుల భారం 52% పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం లేకపోయినా అప్పుల్లో ఇంత భారీ తేడా రావడానికి కారణమేంటో స్పష్టంగా కనిపించలేదు. బడ్జెట్లో పొందుపరిచిన ఖర్చుల్లో ఇప్పటి వరకు పింఛన్లు (102%), రాయితీలు (123%) మాత్రమే అంచనాలను మించాయి. మిగిలిన ఖర్చులన్నీ ఆలోపే ఉన్నాయి. ఫిబ్రవరి వరకు రెవెన్యూ వ్యయం 86.96%, మూలధన వ్యయం కేవలం 66.98% మాత్రమే జరిగింది. మిగిలిన నెల రోజుల్లో మిగతాది ఖర్చు చేయడం కష్టమే.