AP High Court Verdict on Three Capitals Issue : ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఎప్పటికప్పుడు నివేదిక
AP High Court on Amaravati : అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని.. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికిి భూమిని తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఆ అధికారం శాసనసభకు లేదు..
AP High Court Verdict on Amaravati : ఏపీ రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ఆదేశించింది. రాజధాని అవసరాలకే భూమిని వినియోగించాలని చెప్పింది. పూలింగ్ భూములను ఇతర అవసరాల కోసం తనఖాకు వీల్లేదని పేర్కొంది. రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని హైకోర్టు తీర్పు చెప్పింది.
కృతజ్ఞతలు తెలిపిన రైతులు..
Amaravati Farmers : అమరావతి తీర్పుపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు బయట న్యాయస్థానానికి సాష్టాంగ నమస్కారం చేశారు. హైకోర్టు ముందు నిలబడి తీర్పుపై కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి తీర్పు గొప్ప విజయం: న్యాయవాదులు
Lawyers on AP High Court Verdict : అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈ భూములు కేటాయించకూడదని స్పష్టం చేయడమే కాక..అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని హైకోర్టు ఆదేశించినట్లు న్యాయవాది రాజేంద్ర తెలిపారు.
ఏపీ హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రజల గొప్ప విజయంగా భావించాలని న్యాయవాది సుంక రాజేంద్రప్రసాద్ అన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి చట్టాలు చేయడాన్ని హైకోర్టు గుర్తించిందన్న రాజేంద్రప్రసాద్.. పిటిషనర్లకు ఖర్చుకోసం రూ.50వేలు ఇవ్వాలని చెప్పడం తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. రైతులకు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుంటుందని మేం అనుకోవట్లేదని ఆయన అన్నారు.
అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల న్యాయవాది నర్రా శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. త్రిసభ్య ధర్మాసనం.. 75 కేసుల్లో వేర్వేరుగా తీర్పులిచ్చిందని.. ముఖ్యంగా నాలుగైదు అంశాలను తీర్పులో స్పష్టంగా వివరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసన వ్యవస్థకు 3రాజధానుల చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పిందన్నారు.