తెలంగాణ

telangana

ETV Bharat / city

AP High Court on girl treatment : 'ఆ బాలికకు ఉచిత వైద్యం అందించాలి' - telangana news

AP High Court on girl treatment : అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికకు ఉచితంగా చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. చికిత్స ఖర్చులను సమకూర్చేందుకు క్రౌడ్‌ ఫండింగ్‌ సహా అన్ని మార్గాలనూ అన్వేషించాలని సూచించింది.

AP High Court on girl treatment,. ap hc
బాలిక చికిత్సపై ఏపీ హైకోర్టు కామెంట్స్

By

Published : Jan 30, 2022, 12:52 PM IST

hc on girl treatment : అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న ఓ బాలికకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండగా నిలిచింది. ఆ బాలికకు ఉచితంగా చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చికిత్స ఖర్చులను సమకూర్చేందుకు క్రౌడ్‌ ఫండింగ్‌ సహా అన్ని మార్గాలనూ అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇదే వ్యాధి విషయంలో దిల్లీ, కేరళ హైకోర్టులు ఉచితంగా చికిత్స అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

ఎంజైమ్‌ మార్పిడి చికిత్స అవసరం..

గోషే అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ బాలిక ఏపీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. జీవించే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందన్నారు. అరుదైన వ్యాధితో తన జీవితం కుదించుకుపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయవాది రాజేశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో ఇలాంటి రోగులు ఇద్దరు, ముగ్గురే ఉన్నారన్నారు. ఈ వ్యాధితో కాలేయం, ప్లీహం అసాధారణంగా పెరుగుతాయన్నారు. ఇతర అవయవాలపైనా వ్యాధి ప్రభావం చూపుతుందన్నారు. గోషేతో బాధపడేవాళ్లకు ఎంజైమ్‌ మార్పిడి చికిత్స చేయాలని, రెండు వారాలకు ఒకసారి ఇంజెక్షన్‌ ఇవ్వాలని చెప్పారు. సుమారుగా ఏడాదికి రూ.25లక్షలు ఖర్చు అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి ఖర్చులను భరించే స్థితిలో కేంద్రప్రభుత్వం లేదన్నారు.

'ఉచిత వైద్యం అందించాలి'

వ్యక్తిగత సాయం అందించే విధానం లేదన్నారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం వివరాలను కోర్టుకు అందజేశారు. ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బలహీనవర్గాలకు ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న వివరాలను వెల్లడించారు. బాలిక బాధపడుతున్న వ్యాధికి ఆరోగ్య బీమా వర్తించదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వివరాలను పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పథకాలు, విధానాలు బాలిక వ్యాధికి వర్తించడం లేదన్నారు. పేదరికంతో అరుదైన వ్యాధిగ్రస్తులు కన్నుమూసేలా ప్రభుత్వం వదిలేయకూడదని గతంలో కోర్టులు చెప్పాయన్నారు. బాలికకు ఎంజైమ్‌ మార్పిడి చికిత్స ఉచితంగా అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఇదీ చదవండి:దేశ ఘనతను చాటుతూ రూపొందించిన ప్రత్యేక గీతానికి జేజేలు

ABOUT THE AUTHOR

...view details