ఏపీ రాజధాని భూముల విషయంలో అవినీతి నిరోధకశాఖ (అనిశా) నమోదు చేసిన కేసులో వివరాలను మీడియా వెల్లడించకుండా నిలువరిస్తూ తాము ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులు.. ముఖ్యమంత్రి సలహాదారు అజేయకల్లం నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో నిష్ఫలం అయ్యాయని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఎఫ్‌ఐఆర్, ఇతర అంశాలు, ముఖ్యమంత్రి రాసిన లేఖ అన్నీ బయటపడ్డాయని స్పష్టం చేసింది. దీంతో కేసు వివరాలను తెలుసుకునే హక్కు తమకుందని, అవి తెలిపేలా గ్యాగ్ ఉత్తర్వులను సవరించాలంటూ న్యాయవాది మమతారాణి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపింది.
ఆమెను ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదంది. ప్రధాన వ్యాజ్యంలో మిగిలిన అనుబంధ పిటిషన్లు రోస్టర్ ప్రకారం తగిన బెంచ్ ముందుకు విచారణకు వస్తాయని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత అనుబంధ పిటిషన్‌లో ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.