తెలంగాణ

telangana

ETV Bharat / city

AP debts: అప్పుల వేటలో మళ్లీ ఆస్తుల బదలాయింపు? - ఏపీ తాజా సమాచారం

AP debts: ఎక్సైజ్‌ వ్యాపారం, మద్యం డిపోలు, వాహనాల వంటి ఆస్తులన్నీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు బదలాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా గతంలో ఏపీ ఎస్​డీసీ, రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్​ల నుంచి రూ.వేల కోట్లు అప్పులను తీసుకున్న తరహాలోనే.. ఇప్పుడు బేవరేజేస్ కార్పొరేషన్​ను ముందుంచి రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ ఎక్సెైజ్ వర్గాల్లో సాగుతోంది.

AP debts: అప్పుల వేటలో మళ్లీ ఆస్తుల బదలాయింపు?
AP debts: అప్పుల వేటలో మళ్లీ ఆస్తుల బదలాయింపు?

By

Published : Feb 25, 2022, 9:02 AM IST

AP debts: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్‌ వ్యాపారం, మద్యం డిపోలు, వాహనాల వంటి ఆస్తులన్నీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు బదలాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్సైజ్ కమిషనర్‌ అంటే.. ప్రభుత్వం దగ్గరున్న బాధ్యతలన్నీ కార్పొరేషన్‌కు అప్పగించింది. దేశీయ తయారీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్‌), విదేశీ మద్యం దిగుమతులు, ఎగుమతులు, టోకు వ్యాపారం, పంపిణీ బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు (ఏపీఎస్‌బీసీఎల్‌) దఖలు పరిచింది. ఎక్సైజ్‌ కమిషనర్‌ తన ఆధీనంలోని అన్ని ఐఎంఎఫ్‌ఎల్‌ డిపోలు, వాటిలోని మద్యం నిల్వలు, చరాస్తులన్నీ ఏపీఎస్‌బీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు అప్పగించాలంది. టోకు డిపోలను ఏర్పాటు చేసేందుకు వివిధ భవనాల యజమానులతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఐఎంఎఫ్‌ఎల్‌, విదేశీమద్యం సరఫరాదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలను సైతం బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

గతంలో ఏపీఎస్‌డీసీ, రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ల నుంచి రూ.వేల కోట్ల అప్పులను తీసుకున్న తరహాలోనే... ఇప్పుడు బేవరేజస్‌ కార్పొరేషన్‌ను ముందుంచి పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ ఎక్సైజ్‌ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకుని వాటిని పాలనాపరమైన ఖర్చులకు వాడుకుంటోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని విధించి పది మద్యం డిపోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖజానాకు వచ్చిన తర్వాత తిరిగి బ్యాంకులకు బదలాయించేలా ఎస్క్రో చేసి ఎస్‌బీఐ కన్షార్షియం నుంచి రూ.25 వేల కోట్ల రుణానికి గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు పెట్టిన షరతు ప్రకారం 10% ఆస్తులను విశాఖ నగరంలోని వివిధ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు కూడా పెట్టింది. మరోవైపు ఏపీ రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా పెట్రోల్​, డీజిల్‌పై రోడ్డు రవాణా సెస్‌ విధించి... దీన్నుంచి వచ్చే ఆదాయాన్ని అప్పు తీర్చేందుకు ఎస్క్రో చేస్తామని చూపించి రూ.వేల కోట్ల రుణం తీసుకువచ్చారు. ఆర్‌ అండ్‌ బీ ఆస్తులను సైతం కార్పొరేషన్‌కే బదలాయించారు.

కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించినా...

ఈ తరహాలో అప్పులను తేవడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ఆర్థికశాఖ తప్పు పట్టింది. ఏపీ ప్రభుత్వం నుంచి వివరణ కూడా కోరింది. తర్వాత ఏపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చినా కేంద్ర ఆర్థికశాఖ సంతృప్తి చెందలేదు. పైగా ఏపీ కార్పొరేషన్లకు రుణాలిచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలంటూ బ్యాంకులను హెచ్చరించింది. ఈ క్రమంలో ఏపీఎస్‌డీసీకి ఇచ్చే ఆఖరి విడత రుణాన్ని కూడా నిలిపివేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌... ప్రధాని మోదీకి జనవరి ప్రారంభంలో రాసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రుణాలు ఇచ్చేలా కేంద్ర ఆర్థికశాఖ సానుకూల నిర్ణయం తీసుకునేలా సహకరించాలనీ కోరారు. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఎస్‌బీఐ రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు పెద్ద మొత్తంలో రుణం కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాను ఏపీ ప్రభుత్వం సంప్రదిస్తున్నట్లు తెలిసింది.

రాబడిని ఎస్క్రో చేసేందుకు చట్ట సవరణ

అప్పు తెచ్చేందుకు అవసరమైన ఆదాయాన్ని ఎస్క్రో చేసేందుకు ఏపీ ప్రభుత్వం మద్యం చట్టా(1993)నికి సవరణ చేసింది. అంతకుముందే 2021 నవంబరులోనే జీవో 313 విడుదల చేసింది. దాని ప్రకారం మద్యం అమ్మకాలను నిరోధించేందుకు అదనపు ఎక్సైజ్‌ రిటైల్‌ ట్యాక్సును విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు వ్యాట్‌ తగ్గించి అదనపు ఎక్సైజ్‌ పన్ను విధించింది. వివిధ కేటగిరీలపై వ్యాట్‌ 130% నుంచి 190% వరకు వసూలు చేసేవారు. అది 35% నుంచి 60% వరకు తగ్గించారు. ఆ స్థానంలో అదనపు ఎక్సైజ్‌ రేటు వివిధ కేటగిరీల మద్యం విక్రయాలపై 85% నుంచి 130% వరకు పెంచారు. ఈ రూపంలో బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయమే రూ.6,000 కోట్లు ఉంటుందని అంచనా. ఆ మొత్తం రుణాలు తిరిగి చెల్లించేందుకు ఆధారంగా చూపి రూ.వేల కోట్లు రుణం తీసుకునే ప్రయత్నం సాగుతోందని భావిస్తున్నారు. ఏపీఎస్‌డీసీకి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌కు ఆస్తులు బదలాయించినట్లే... ఇప్పుడు బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఆస్తులు, వ్యాపారం, మద్యం డిపోలు, చరాస్తులను బదలాయించారని పేర్కొంటున్నారు.

మిగిలిన నిబంధనల్లో మార్పు లేదు

మద్యం సరఫరాదారులకు చెల్లింపులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే ఇకపైనా కొనసాగుతాయని తాజా ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఐఎంఎఫ్‌ఎల్‌ టోకు డిపోల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందే కొనసాగుతారంది. బార్‌ల లైసెన్స్‌దారులకు టోకు డిపోల నుంచి బెవరేజెస్‌ కార్పొరేషనే మద్యం సరఫరా చేస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం వస్తున్న పారితోషికాన్ని (రెమ్యునరేషన్‌) ఇకపై టోకు వ్యాపారంలో లాభం (హోల్‌సేల్‌ ట్రేడ్‌ మార్జిన్‌)గా వ్యవహరిస్తారని తెలిపింది. న్యాయపరమైన, ఇతర ఖర్చులను... టోకు వ్యాపార లాభం, జరిమానాలు, జీఆర్‌ఎన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు, పేమెంట్‌ ప్రాసెసింగ్‌ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం నుంచి భరించాలని సూచించింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌... నిర్దేశిత అకౌంటింగ్‌ విధానాల్ని అనుసరించాలని, నిబంధనల ప్రకారం ఆడిట్‌ చేయించాలని, ఆ వివరాల్ని, ఖాతాల్ని ప్రతి నెలా ఎక్సైజ్‌ కమిషనర్‌కు అందజేయాలని తెలిపింది. ఈ అంశాలన్నిటినీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ... బోర్డు సమావేశంలో ఉంచి అనుమతి తీసుకోవాలని స్పష్టంచేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details