GO's for HRA: వేతన సవరణ సంఘం (పీఆర్సీ) అమలుపై ఏపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నా.. ఉద్యోగ సంఘాల నాయకులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యాన్ని (హెచ్‌ఆర్‌ఏ) ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఒకటి, రాష్ట్రంలోని మిగతా ఉద్యోగులకు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా హెచ్‌ఆర్‌ఏ ఖరారు చేస్తూ మరొకటి రెండు వేర్వేరు జీవోలు విడుదల చేసింది. సవరించిన హెచ్‌ఆర్‌ఏ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం 30% హెచ్‌ఆర్‌ఏ ఉండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం అది 24%కు తగ్గింది. అంటే వారు 6% నష్టపోతున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం.. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ కనిష్ఠంగా 12%, గరిష్ఠంగా 30% ఉంది.
ఉద్యోగుల ఆందోళనకు ముందు ప్రభుత్వం జనవరి 17న జారీచేసిన ఉత్తర్వుల్లో దీన్ని గణనీయంగా తగ్గించింది. దిల్లీ, హైదరాబాద్‌ల్లో పనిచేస్తున్న కొద్దిమంది ఉద్యోగులకు మాత్రం 24% హెచ్‌ఆర్‌ఏ నిర్ణయించింది. సచివాలయం సహా రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు కనిష్ఠంగా 8%, గరిష్ఠంగా 16% నిర్ణయించింది. ఫిట్‌మెంట్ 23 శాతమే ఇవ్వడంతో పాటు, హెచ్‌ఆర్‌ఏ కూడా తగ్గించడంతో ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఆ నేపథ్యంలో ఉద్యోగసంఘాల నాయకులతో చర్చించిన మంత్రుల కమిటీ పీఆర్సీ అమలుపై ఒక ఒప్పందానికి వచ్చింది. దాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు అప్పుడే వ్యతిరేకించారు. ఉద్యమం కొనసాగిస్తున్నారు. అయినా ఉద్యోగ సంఘాల నాయకులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ప్రభుత్వం సవరించిన హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది.
2011 జనాభా లెక్కల ప్రకారం..
ప్రాంతాలవారీగా హెచ్‌ఆర్‌ఏ నిర్ణయించేందుకు ప్రభుత్వం 2011 జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకుంది. సవరించిన హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వులు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లలో పనిచేస్తూ 2022లో సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకుంటున్నవారికి, వర్క్‌ఛార్జ్‌డ్ ఉద్యోగులకు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆయా నగరాలు, పట్టణాలకు చుట్టూ 8 కి.మీ.ల పరిధిలోని వారందరికీ నిర్దేశిత హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని, దీనికి సంబంధించి గతంలో ఉన్న ఉత్తర్వులే కొనసాగుతాయని తెలిపింది. దీనిపై జిల్లా కలెక్టర్లు తాజా నోటిఫికేషన్ విడుదల చేస్తారని పేర్కొంది.
*ఆంధప్రదేశ్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్, రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏకి సంబంధించి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
సవరించిన విధానం ఇలా..
రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మూల వేతనంలో 24%, గరిష్ఠంగా రూ.25,000 హెచ్‌ఆర్‌ఏగా నిర్ణయించింది. ఈ సదుపాయం 2024 జూన్ వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు 30% హెచ్‌ఆర్‌ఏ ఉండేది. వాటిని అమరావతికి తరలించాక అక్కడి నుంచి వచ్చిన ఉద్యోగులందరికీ 30% హెచ్‌ఆర్‌ఏ కొనసాగించారు. పదకొండో పీఆర్సీ అమల్లో భాగంగా... ఈ ప్రభుత్వం వారికి హెచ్‌ఆర్‌ఏని 16%కు తగ్గించింది. దానిపై ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఇప్పుడు 24%కు పెంచింది.
*మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్ని నాలుగు కేటగిరీలుగా విభజించింది. 50 లక్షల జనాభా దాటిన నగరాల్లో పనిచేస్తున్నవారిని ఒక కేటగిరీగా, 2 లక్షల నుంచి 50 లక్షల వరకు రెండో కేటగిరీగా, 50 వేల నుంచి 2 లక్షల వరకు మూడో కేటగిరీగా, 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్నవారిని నాలుగో కేటగిరీగా విభజించింది.
*జనాభా 50 లక్షలు దాటితే 24%, గరిష్ఠంగా రూ.25 వేలు హెచ్‌ఆర్‌ఏగా నిర్ణయించింది. దిల్లీలోని ఏపీభవన్‌తో పాటు, దిల్లీ, హైదరాబాద్‌ల్లోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.
*2 లక్షల నుంచి 50 లక్షల వరకు జనాభా ఉంటే 16%, గరిష్ఠంగా రూ.17 వేలు హెచ్‌ఆర్‌ఏగా నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా కేంద్రాలతో పాటు, 50 లక్షల జనాభా దాటిన నగరాలన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. అనంతపురం, ఏలూరు, మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ), గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, మచిలీపట్నం ఈ కేటగిరీలోకి వస్తాయి. ప్రస్తుతం ఇది 20% ఉంది. కొత్త విధానంలో వీరు 4% నష్టపోతారు.
*50 వేల నుంచి 2 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12%, గరిష్ఠంగా రూ.13 వేలు హెచ్‌ఆర్‌ఏగా నిర్ణయించింది. రాష్ట్రంలోని 54 పట్టణాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. వాటి పేర్లు ప్రభుత్వం జీవోలో పొందుపరిచింది. ప్రస్తుతం ఇది 14.5% ఉంది. వీరికి 2.5% నష్టం జరుగుతోంది.
*50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 10%, గరిష్ఠంగా రూ.11 వేలు హెచ్‌ఆర్‌ఏగా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది 12% ఉంది. అంటే వీరికి 2% నష్టం జరుగుతుంది.పీఆర్సీపై పునఃసమీక్షించాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దార్ల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ ప్రతులను సీఎం జగన్‌కు పోస్టులో పంపించారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వినతులను సీఎంకు పంపించడాన్ని ప్రారంభించారు. ఈ నెల 25 వరకు లక్షల వినతులను పంపించనున్నారు. కర్నూలులో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు హృదయరాజు, ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రావు విజ్ఞాపనలు పంపించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రసాద్, గుంటూరులో రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సుధీర్‌బాబు వినతులను పంపించే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 24 వరకు పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారుల అభిప్రాయాలను బ్యాలెట్ ద్వారా సేకరించనున్నారు. పీఆర్సీపై ఎంతమంది అసంతృప్తితో ఉన్నారో ప్రభుత్వానికి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయనున్నారు.
పీఆర్సీపై లక్ష వినతులు..
పీఆర్సీపై పునఃసమీక్షించాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దార్ల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ ప్రతులను సీఎం జగన్‌కు పోస్టులో పంపించారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వినతులను సీఎంకు పంపించడాన్ని ప్రారంభించారు. ఈ నెల 25 వరకు లక్షల వినతులను పంపించనున్నారు. కర్నూలులో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు హృదయరాజు, ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రావు విజ్ఞాపనలు పంపించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రసాద్, గుంటూరులో రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సుధీర్‌బాబు వినతులను పంపించే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 24 వరకు పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారుల అభిప్రాయాలను బ్యాలెట్ ద్వారా సేకరించనున్నారు. పీఆర్సీపై ఎంతమంది అసంతృప్తితో ఉన్నారో ప్రభుత్వానికి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయనున్నారు.
ఇంటి అద్దె భత్యం అమల్లో అన్యాయం: ఏపీటీఎఫ్
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఇంటి అద్దెభత్యాన్ని మానిటరీ బెనిఫిట్ ఇచ్చే ఏప్రిల్ 2020 నుంచి అమలు చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, కులశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. జనవరి 2022 నుంచి అమలు చేస్తే.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా నష్టపోతారని పేర్కొన్నారు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, ఐఆర్ 27 శాతం కంటే ఎక్కువగా ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని పేర్కొన్నారు.
ఇదీచూడండి: Traffic Challans :ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక అంతే!