ఏపీలోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా కేసుల వివరాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం కర్ఫ్యూపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు.
AP curfew : గడువు దాటాక దుకాణాలు మూయకుంటే మోతే..! - andhra pradesh lockdown guidelines
కర్ఫ్యూ నిబంధనల్లో మార్పులు చేసిన ఏపీ సర్కారు రాత్రి 9 తర్వాత దుకాణాలు తెరిస్తే జరిమానాతో పాటు దుకాణాలు తెరవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మాస్కులు ధరించకుంటే వంద రూపాయల జరిమానా తప్పనిసరిగా విధించాలని సూచించింది.
రాత్రి 9 గంటలకు దుకాణాలు మూతపడాలని.. నిబంధనలు పాటించని దుకాణాలను 2-3 రోజులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘనపై ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించాలని స్పష్టం చేసింది. ఫొటోలు పంపేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబరును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు ప్రజలెవరూ గుమిగూడకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరింది. అందరూ మాస్కులు ధరించేలా చూడాలని మార్కెట్ కమిటీలను ఆదేశించింది. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా విధించే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.