తెలంగాణ

telangana

ETV Bharat / city

Power Issues in AP : రైతుకు కరెంట్‌ షాక్‌.. పొలాల్లో అన్నదాతల పడిగాపులు - ఏపీ రైతుల కరెంట్ సమస్యలు

Power Issues in AP : కరెంట్ కోతలు ఏపీ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోవడం కోసం ఆక్వా రైతులు అద్దె జనరేటర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Power Issues in AP
Power Issues in AP

By

Published : Feb 19, 2022, 9:05 AM IST

Power Issues in AP : ఏపీలో వ్యవసాయానికీ విద్యుత్‌ కోతలు తప్పట్లేదు. విద్యుత్‌ కోసం ఇప్పటికే రైతులు రోడ్డెక్కుతున్నారు. కొద్దిరోజుల కిందటి వరకు విద్యుత్‌ సరఫరాకు ఢోకా లేని స్థితి నుంచి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పొలాల దగ్గరే పడిగాపులు పడుతున్నారు. ఒకే బోరు కింద ఉన్న పొలంలో సగం తడిస్తే.. మిగిలిన సగానికి నీరందక పంట వాడుతోంది. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల సబ్‌ స్టేషన్ల ముట్టడి.. రోడ్లపై నిరసనలు చేస్తున్నారు. ఆక్వా రైతులూ రొయ్యలను కాపాడుకోవడానికి జనరేటర్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా కొనుగోలుకు విద్యుత్‌ దొరక్కపోవడమే సమస్యకు కారణమని అధికారులు చెబుతున్నారు.

విద్యుత్‌ అంతరాయాల వివరాలేవీ దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ, కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ వెబ్‌సైట్లలో కనిపించడం లేదు. తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) మాత్రం సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట 11 కెవి ఫీడర్‌ పరిధిలో శుక్రవారం 8 గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచింది. ఇదే తీరులో మొత్తం 66 ఫీడర్లలో విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది.

విద్యుత్‌ సరిగా రావటం లేదు. రెండు గంటలు ఇచ్చి మళ్లీ ఆపేస్తున్నారు. పొద్దున్న ఆరు గంటలకు కొద్దిసేపు ఇచ్చారు. లైను ఫాల్టు పేరుతో ఆపుతున్నారు. సజ్జ, వేరుసెనగ, కొర్ర, నువ్వులు సుమారు 50 ఎకరాల్లో వేశాం. 9 గంటలు విద్యుత్‌ ఉంటే పొలం అంతా తడుస్తుంది. రెండు రోజులు నీరు పారకుంటే వేరుసెనగ భూమి లోపలే పురుగు తింటుంది. కరెంటు ఎప్పుడు వస్తుందా? అని అక్కడే పడిగాపులు పడాల్సి వస్తోంది.

- రైతు రమణ, కడప జిల్లా దువ్వూరు మండలం మీర్జాఖాన్‌పల్లి

మొక్కజొన్న 2 ఎకరాలు, వరి 4 ఎకరాల్లో సాగు చేశా. కొద్ది రోజుల కిందటి వరకు పగటి పూట 9 గంటలు విద్యుత్‌ ఒకే విడత వచ్చేది. కొన్నిరోజుల కిందటి వరకు 2 గంటలే విద్యుత్‌ ఇచ్చారు. దీంతో వెన్ను, పొత్తుల పీచు దశలో ఉన్న మొక్కజొన్న దెబ్బతింది. 4 రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో సబ్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశాం. ఆ తర్వాత రోజుకు 5-7 గంటలు విద్యుత్‌ వస్తోంది. అది కూడా ఒకే విడత కాకుండా వంతులవారీగా ఇస్తున్నారు. విద్యుత్‌ కోసం అర్ధరాత్రిళ్లు వేచిచూడాల్సి వస్తోంది.

- బొల్లిన రమేశ్, పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం

రెండు గ్రూపులుగా సరఫరా

రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు సుమారు 18.5 లక్షలు. వాటికి పగటి పూట 9 గంటలు అంతరాయం లేకుండా సాయంత్రం 6 గంటల్లోగా విద్యుత్‌ సరఫరా చేయాలి. లోడ్‌ సర్దుబాటు కోసం వాటి పరిధిలో ఉన్న కనెక్షన్లను ఎ, బి అనే రెండు గ్రూపులుగా డిస్కంలు విభజించాయి. ఎ గ్రూపు కనెక్షన్లకు తెల్లవారుజాము 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. బి గ్రూప్‌ కనెక్షన్లకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యుత్‌ సరఫరా చేయాలి.

ఆన్‌లైన్‌లో విద్యుత్‌ దొరక్కపోతే.. సరఫరా ఆగినట్లే

డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, కేంద్రం నుంచి రావాల్సిన రుణాలు రావట్లేదని ఒక అధికారి పేర్కొన్నారు. దీంతో విద్యుత్‌ కొనుగోలుకు అవసరమైన మొత్తం సర్దుబాటు కావటం లేదు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం సుమారు 200 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ)లకు చేరింది. డిమాండ్‌ సర్దుబాటుకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా రోజూ కనీసం 25-30 ఎంయూ విద్యుత్‌ను ఎక్స్ఛేంజిల నుంచి కొనాల్సి వస్తోంది. దీనికోసం 6 టైం బ్లాక్‌లు (ఒక్కో బ్లాక్‌ 15 నిమిషాలు) ఆన్‌లైన్‌లో యూనిట్‌ ధర కోట్‌ చేయాలి. డిస్కంలు కోట్‌ చేసిన ధరకు విద్యుత్‌ దొరక్కపోతే డిమాండ్‌ సర్దుబాటుకు లోడ్‌ రిలీఫ్‌ను అమలు చేయక తప్పటం లేదు. మళ్లీ గంటన్నర తర్వాతే విద్యుత్‌ కొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విద్యుత్‌ సమస్యకు ఇదే కారణమని ఒక అధికారి తెలిపారు.

జనరేటర్ల కోసం ఆక్వా రైతుల పరుగులు

ఆక్వా కనెక్షన్లకు రోజులో రెండుమూడు గంటలు కోతలు ఉంటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరెంట్‌ లేకపోతే చెరువుల్లోని రొయ్యలకు ఆక్సిజన్‌ అందక చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో 40 హెచ్‌పీ జనరేటర్‌ను నెలకు రూ.10వేల అద్దెకు తీసుకుంటున్నారు. జనరేటర్‌ గంట వినియోగించాలంటే 10 లీటర్ల డీజిల్‌ కావాలి. రోజులో రెండుమూడు గంటలు సరఫరా ఆగడంతో రూ.3వేలు డీజిల్‌కు ఖర్చవుతుందని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నానికి చెందిన ఆక్వా రైతు దామోదర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details