తెలంగాణ

telangana

ETV Bharat / city

'వుయ్​ వాంట్​ జస్టిస్'​.. నినాదాలతో హోరెత్తిన బెజవాడ వీధులు

AP Employees Chalo Vijayawada: ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగుల నినాదాలతో బెజవాడ వీధులు జనసంద్రంగా మారాయి. రాష్ట్రం నలుమూల నంచి భారీ ఎత్తున విజయవాడకు చేరుకున్నారు. ఉద్యోగుల నినాదాలతో బీఆర్​టీఎస్​ రోడ్డు మార్మోగుతోంది. ఇసుకేస్తే రాలనంత జనంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. 'నేనున్నాన'ని అభయమిచ్చిన జగన్​.. నేడు పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులను తీవ్రవాదుల్లాగా చూస్తున్నారని దుయ్యబట్టారు.

ap employees protests
ఏపీ ఉద్యోగుల ఆందోళనలు

By

Published : Feb 3, 2022, 2:56 PM IST

AP Employees Chalo Vijayawada: పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ ఆందోళనతో బెజవాడ వీధులు జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్​ నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు.. ఎన్జీవో హోం నుంచి అలంకార్‌ థియేటర్‌ మీదుగా బీఆర్‌టీఎస్‌ కూడలి వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీంతో ఆయా మార్గాలు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. జిల్లాల నుంచి వచ్చేవారిని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా.. ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు. ఒక దశలో అంచనాలకు మించి ఉద్యోగులు రావడంతో చేసేదేమీ లేక పోలీసులు చేతులెత్తేశారు.

నినాదాలతో మార్మోగుతున్న బీఆర్‌టీఎస్‌ రోడ్డు..

పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఉద్యోగులు చేస్తున్న నినాదాలతో బీఆర్‌టీఎస్‌ రోడ్డు మార్మోగుతోంది. పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. హక్కుల సాధనకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌’.. ‘అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఏపీలో ఉన్నాం.. పాక్‌లో కాదు..

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ‘‘నేనున్నాను.. నేను విన్నానన్న’’ సీఎం జగన్‌.. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణమని విమర్శించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ తమను రోడ్డుపైకి ఈడ్చారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. ‘‘మేం ఏపీలోనే ఉన్నాం.. పాకిస్థాన్‌లో కాదు.. అణచివేత తగదు’’ అని ఉద్యోగులు వ్యాఖ్యానించారు.

పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో..

అంతకుముందు ‘చలో విజయవాడ’ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. బారికేడ్లు పెట్టి ఉద్యోగులను అడ్డుకున్నారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు మారువేషాల్లో విజయవాడ వెళ్లేందుకు యత్నించారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఉద్యోగి అంగవైకల్యం ఉన్న వ్యక్తి వలే మారు వేషంలో వెళ్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఉద్యోగులు కూలీల మాదిరిగా రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు వారి కళ్లు గప్పి విజయవాడ చేరుకున్నారు.

ఇదీ చదవండి:BJP Bheem Deeksha : 'కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలని కేసీఆర్ కుట్ర'

ABOUT THE AUTHOR

...view details