తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Debt: అప్పుల గుప్పిట ఏపీ.. రూ.17,750 కోట్లకు బహిరంగ మార్కెట్‌ రుణం - అప్పుల గుప్పిట ఏపీ

ఆంధ్రప్రదేశ్​ రుణాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. బహిరంగ రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.17,750 కోట్లకు చేరుకుంది. రిజర్వ్​బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో ఆ రాష్ట్రం రూ.1,750 కోట్ల మేర రుణం పొందింది.

DEBTS OF AP: అప్పుల గుప్పిట ఏపీ.. రూ.17,750 కోట్లకు బహిరంగ మార్కెట్‌ రుణం
DEBTS OF AP: అప్పుల గుప్పిట ఏపీ.. రూ.17,750 కోట్లకు బహిరంగ మార్కెట్‌ రుణం

By

Published : Jul 14, 2021, 7:37 AM IST

ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.17,750 కోట్లకు చేరుకుంది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో ఆ రాష్ట్రం రూ.1,750 కోట్ల మేర రుణం పొందింది. వెయ్యి కోట్ల రూపాయలను 14 సంవత్సరాల కాలపరిమితితో 7.12% వడ్డీకి తీసుకుంది. రూ.750 కోట్లను 15 ఏళ్ల కాలపరిమితితో 7.14% వడ్డీ చెల్లించేందుకు అంగీకరిస్తూ సమీకరించింది. వీటిని కలిపితే మొత్తం బహిరంగ రుణం రూ.17,750 కోట్లకు చేరింది. తొలి తొమ్మిది నెలల కాలానికి కేంద్రం రూ.20,751 కోట్ల మేర అప్పు తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే డిసెంబరు వరకు రూ.3,000 కోట్లను మాత్రమే అప్పుగా తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

ఏపీ అప్పులపై కేంద్రం దృష్టి

కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై దృష్టి పెట్టింది. ఏయే రూపేణా ఎంత అప్పు తీసుకున్నారో లెక్కలన్నీ ఇవ్వాలని కోరింది. వాటి ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రుణ పరిమితికి కోత పెట్టి ఏడాది మొత్తం మీద రూ.27,688.68 కోట్ల అప్పునకే అవకాశం కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ప్రకారం ఏ రాష్ట్రం ఎంత మేర అప్పు తీసుకునేందుకు వీలుందో కేంద్రమే నిర్ణయిస్తుంది. రిజర్వు బ్యాంకు ఆయా రాష్ట్రాలను సంప్రదించి ఏ రాష్ట్రం ఎప్పుడు ఎంత అప్పు తీసుకునే అవకాశం ఉందో క్యాలెండర్‌ను ముందుగా విడుదల చేస్తుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి జులై నుంచి సెప్టెంబరు వరకు రుణ క్యాలెండర్‌ను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సెప్టెంబరు 7 వరకు మరో రూ.5,000 కోట్లు రుణం తీసుకునే అవకాశముంది.

ప్రతి నెలా రూ.5వేల కోట్ల రుణం...

మకున్న పరిమితి మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రం అప్పులు చేస్తున్నట్లే తామూ చేస్తున్నామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెబుతున్నారు. అప్పుతో సేకరించిన నిధులను ప్రజా సంక్షేమ పథకాల కింద పేదలకే ఇస్తున్నామన్నారు. ప్రతినెలా రాష్ట్రం సంక్షేమ పథకాలు, జీతాలు, పింఛన్లు, వడ్డీ-అసలు చెల్లింపులకు రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన అనేక రకాల నిధులూ సరిపోవడం లేదు. ఫలితంగా ప్రతినెలా రూ.5,000 కోట్ల వరకు రుణంపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌ రుణం డిసెంబరు వరకు ఇక పరిమితి రూ.3,000 కోట్లకే ఉంది.

మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,100 కోట్ల మేర గ్యారంటీల ఆధారంగా అప్పులూ తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల మొత్తం పరిమితి రూ.1,06,200 కోట్లకు మించకూడదు. ఇప్పటికే ఆ మేరకు ప్రభుత్వం గ్యారంటీలు కల్పించింది. దీంతో ఆ రూపేణా రుణం పొందే మార్గాలు సన్నగిల్లాయి. దీంతో... రిజర్వు బ్యాంకు కోత పెట్టిన రుణ పరిమితి నుంచి మినహాయింపు పొందే ప్రయత్నాలు, అందుకు అవసరమైన వాదన ఆర్థికశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండి:Ts Cabinet: రిజిస్ట్రేషన్ రుసుమును ఏడున్నర శాతానికి పెంచుతూ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details