తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడే ఏపీ మంత్రివర్గ విస్తరణ... రాజ్​భవన్​లో ప్రమాణస్వీకారం - andhra pradesh cabinet extend

అధికారం చేపట్టిన ఏడాది తర్వాత తొలిసారి ఏపీ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి జగన్ విస్తరించనున్నారు. ఇద్దరు మంత్రుల రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజికవర్గాలకే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు... ఇవాళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

andhra pradesh cabinet
andhra pradesh cabinet

By

Published : Jul 22, 2020, 8:10 AM IST

ఏపీ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఇవాళ విస్తరించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 29 నిమిషాలకు ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యులు సీదిరి అప్పలరాజు మంత్రి పదవులను పొందనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో... గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.

కొద్ది మందే

కరోనా వ్యాప్తి దృష్ట్యా అతి కొద్ది మందితోనే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్, సభాపతి తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌, మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఒంటి గంటకు బయల్దేరి రాజ్‌భవన్‌కు వెళ్తారు. ప్రమాణస్వీకారం ముగిశాక 2 గంటల 10 నిమిషాలకు తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.

అదే సామాజిక వర్గానికి

పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ రెండు పదవులనూ రాజీనామా చేసిన మంత్రుల సామాజికవర్గాలకు చెందినవారికే తిరిగి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. బోస్‌ సామాజికవర్గం శెట్టిబలిజకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అమాత్యయోగం కల్పించారు. మత్స్యకార కుటుంబానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజికవర్గం నుంచి వచ్చిన సీదిరి అప్పలరాజుకు మంత్రిగా అవకాశమిచ్చారు. గోపాలకృష్ణ ఎమ్మెల్యే కాకముందు జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. అప్పలరాజు వైద్యుడిగా సేవలందించారు. వీరిద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే.

మార్పులు ఉండకపోవచ్చు

కొత్త మంత్రుల ఎంపికపై స్పష్టత వచ్చిన తరుణంలో వారికి శాఖల కేటాయింపుపైనా ప్రధాన చర్చ నడుస్తోంది. మోపిదేవి వెంకటరమణ నిర్వహించిన మత్స్య, పశుసంవర్ధకశాఖలనే అప్పలరాజుకు కేటాయించే అవకాశాలున్నాయి. బోస్‌... ఉపముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేయగా... ఈ శాఖలను మరో సీనియర్‌ మంత్రికి అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌కు ఈ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కృష్ణదాస్‌ చూస్తున్న రోడ్లు-భవనాల శాఖను వేణుగోపాల కృష్ణకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఇక ఇతర మంత్రులకు శాఖల మార్పు దాదాపు ఉండకపోవచ్చని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details