విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని తెలంగాణ భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వ అఫిడవిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు లేదని పేర్కొంది.
పోలవరం కేసుల్లో పార్టీని చేయొద్దు...
పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదంది. అఫిడవిట్‌లోని అంశాలు పరిశీలించి విభజన చట్టంలో పేర్కొన్న హామీలు తుచ తప్పకుండా త్వరగా అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పిటిషనర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.
తెలంగాణ తప్పుదోవ పట్టిస్తోంది...
పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు విభజన చట్టంలో లేవని, కృష్ణా బోర్డు అనుమతులు లేవని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసినా తెలంగాణ ఆయా ప్రాజెక్టులపై ముందుకెళ్తోందని పేర్కొంది. మరోసారి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ‘కృష్ణా బేసిన్‌లో 180 టీఎంసీలకు పైగా వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు ప్రాజెక్టులు...450 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకం తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులు చేపట్టింది.
"కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వొద్దు"
కాళేశ్వరం ముమ్మాటికీ నూతన ప్రాజెక్టే...
రీఇంజినీరింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు చెబుతోంది. ఇది ముమ్మాటికీ నూతన ప్రాజెక్టే. తెలంగాణ నూతన ప్రాజెక్టుల వల్ల పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అపెక్స్ కౌన్సిల్ ముందు ఈ అంశాలు పెట్టాలని పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పరిధిలోని రైతులను విస్మరించి పక్షపాతంతో కాళేశ్వరం పనులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు’ అని ఏపీ అఫిడవిట్‌లో పేర్కొంది.
అఫిడవిట్‌లో ముఖ్యాంశాలు...
- గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీల జలాలు కృష్ణాలోకి తరలించాలి. పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఏపీకి 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలు చెందుతాయి.
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. రిజర్వాయరులోకి నీరు చేరలేదు. సముద్రంలోకి వృధాగా పొతున్న జలాలు వినియోగించుకోవడానికి పట్టిసీమ నిర్మించాం. పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టా, శ్రీశైలం, రాయలసీమకు తరలిస్తున్న జలాల్లో 45 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరడం సమంజసం కాదు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు.
- పోలవరం రిజర్వాయరు పూర్తిస్థాయి నీటిమట్టం 150 అడుగులకు కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చింది.
- విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. కేంద్ర జల సంఘం నూతన బీఐఎస్ కోడ్ ప్రకారం స్పిల్‌వే స్థిరత్వాన్ని తనిఖీ చేసి గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నమూనాకు అనుమతించింది.
- స్పిల్‌వే నీటి విడుదల సామర్థ్యం ఎక్కువగా ఉండడం వల్ల ఎగువ రాష్ట్రాలకే ప్రయోజనం. ఆ ప్రాంతాల్లో ముంపు తగ్గుతుంది. తెలంగాణ కోరుతున్న తాజా పర్యావరణ అనుమతులు, నిల్వ జలాల ప్రభావ మదింపు అవసరం లేదు.డ్యాం ఎత్తు, రిజర్వాయరు సామర్థ్యంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
- రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ప్రాజెక్టు ప్రారంభ స్థాయిలో నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు జలాలు సరిగా అందడం లేదు.
- పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా నీరు విడుదల ఆరోపణ సరికాదు.
- ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.1,050 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
- కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు విడుదల చేసిన సొమ్ములు రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఖర్చు చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ వాటా అనే అంశం ఉత్పన్నం కాదు.
- ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) తీర్మానాలు ఏకపక్షమంటూ తెలంగాణ ఆరోపణ సరికాదు. ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ, ఇంజినీరింగ్ లిమిటెడ్‌కు సంబంధించి తెలంగాణ తప్పుదోవ పట్టిస్తోంది.
- ఏపీభవన్ విభజనకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు.
సంబంధిత కథనాలు...
కాళేశ్వరం విద్యుత్ బకాయి బిల్లులు రూ. 273.63 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు