న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... 49 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో బాపట్ల ఎంపీ సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా ఉన్నారు. మరోవైపు జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులపై న్యాయవాది లక్ష్మీనారాయణ పిల్ దాఖలు చేశారు.
వైకాపా ఎంపీ, మాజీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు నోటీసులు
జడ్జిలను కించపరుస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేయటంపై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. వైకాపా ఎంపీ నందిగాం సురేశ్, ఆమంచి కృష్ణ మోహన్ సహా 49 మందికి నోటీసులు జారీ చేసింది.
జడ్జిలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారని న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియాతో అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చాలా అసభ్యకరంగా ఉన్నాయని... కోర్టులను రాజకీయాలకు వేదిక చేసుకోవడం బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ ఘటనలో కోర్టుపై లేనిపోని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక అనేకమంది నేతలు, ఎంపీలూ ఉన్నారని లక్ష్మీనారాయణ అన్నారు.
కోర్టును భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. కోర్టు తీర్పుల్లో ఎలాంటి పక్షపాతం ఉండదని స్పష్టం చేశారు. దోషులైన వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని బార్ కౌన్సిల్ ఛైర్మన్ రామారావు అభిప్రాయపడ్డారు.