Anganwadi center Aaya harassed child: అంగన్వాడీ కేంద్రంలో ఉండటం లేదని మూడేళ్ల బాలుడిపై.. అక్కడ పనిచేస్తున్న ఆయా చిన్నారి మూతిపై వాత పెట్టింది. అంగన్వాడీ ఆయా.. తన బిడ్డపై అమానుషంగా ప్రవర్తించిందని బాలుడి తల్లి ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కొవ్వూరు నగర్‌లో లక్ష్మీదేవి, శింగారెడ్డి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఈశ్వర్ కృష్ణారెడ్డి(3) సంతానం. కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి ఈ చిన్నారిని పంపిస్తున్నామని, రోజూలాగే ఈ రోజూ వదిలిపెట్టి వచ్చామని బాలుడి తల్లి పేర్కొన్నారు.
బాలుడు అమ్మ కావాలంటూ ఏడవడంతో ఆయా చెన్నమ్మ.. బాబు మూతిపై వాత పెట్టిందని తల్లి ఆరోపించింది. దీంతో.. చిన్నారి మూతిపై బొబ్బలు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత కర్రతో కొట్టిందని.. బాలుడి కాళ్లు, వీపుపై వాతలు పడి ఎర్రగా కమిలిపోయాయని వివరించింది. ఆయాపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఫోనులో మాట్లాడి ఆరా తీశారు. స్థానిక అధికారులు అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు.